CBI Entry In Telangana: తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు లైన్ క్లియర్
Kaleshwaram Project | తెలంగాణలోకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో కాళేశ్వరం కేసును సీబీఐ విచారణ చేపట్టనుంది.

CBI to Probe on Kaleshwaram Project | హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. NDSA తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్, డిజైన్, నిర్మాణ నాణ్యతలో లోపాలు ఉన్నట్లు వెల్లడించినట్లు తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో తెలిపింది. అలాగే, జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని మిషన్ కూడా విచారణ జరిపి అనేక లోపాలను గుర్తించినట్టు స్పష్టం చేసింది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. గతంలో రాష్ట్రానికి సీబీఐ రాకుండా ఉన్న పరిమితులను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది.

2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోకి సీబీఐ అనుమతిని నిరాకరించింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో 51 జారీ చేసింది. దీంతో సీబీఐ అధికారులు ఏదైనా కేసు దర్యాప్తు చేపట్టాలంటే మొదట ప్రభుత్వం అందుకు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన జీవోను ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సవరించింది. జీవో 51ను సవరించి తెలంగాణలోకి సీబీఐ రాక రూట్ క్లియర్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తును సీబీఐకి అప్పటించింది తెలంగాణ ప్రభుత్వం.

CBI acknowledgement
హైకోర్టులో తెలంగాణ అడ్వకేట్ జనరల్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సందర్భంగా, తెలంగాణ అడ్వకేట్ జనరల్ (ఏజీ) నేడు హైకోర్టులో టెక్నికల్‌గా సమాధానమిచ్చారు. సీబీఐ దర్యాప్తును పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాకుండా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక మరియు విజిలెన్స్ రిపోర్టులను బేస్‌గా తీసుకుని కోరినట్లు స్పష్టం చేశారు. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వారి న్యాయవాదులు కోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ మరోసారి కోర్టుకు స్పష్టంచేశారు — సీబీఐ దర్యాప్తు పీసీ ఘోష్ నివేదికను బేస్ చేసుకుని కాదు, NDSA నివేదిక ఆధారంగా కోరినదేనని. అంతేకాదు, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.






















