Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం- కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన, తెలంగాణను వణికిస్తున్న వరుణుడు
Telangana Rains | బలపడుతోన్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. ఇటు ఉత్తర తెలంగాణను వరుణుడు వణికిస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

Rains In Andhra Pradesh News | అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 12 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది క్రమంగా పశ్చిమ- వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
నేడు కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో నేడు (బుధవారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ అంచనా వేసింది.

సెప్టెంబర్ 2న సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 88.7 మిల్లీ మీటర్లు, వజ్రపుకొత్తూరులో 80.7 మిల్లీ మీటర్లు, పలాసలో 70.5 మి.మీ, రావివలసలో 56.5 మిల్లీ మీటర్లు, మదనపురంలో 53.5 మి.మీ, హరిపురంలో 53 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 41.3 అడుగులకు చేరగా.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.72 లక్షల క్యూసెక్కులగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. కృష్ణానది ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,52,772 క్యూసెక్కులు ఉందని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, కాలువలను వాహనాలతో గానీ, కాలి నడకనగానీ దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు.
ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. దీని ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
HEAVY DOWNPOUR ALERT - PHASE 2 ⚠️🌧️
— Telangana Weatherman (@balaji25_t) September 2, 2025
For the next 3days, during Sep 2-4, there will be HEAVY DOWNPOURS in RED marked districts, MODERATE - HEAVY RAINS in BLUE marked districts, LIGHT - MODERATE RAINS ahead in GREEN marked districts
Hyderabad - LIGHT - MODERATE RAINS expected… pic.twitter.com/IbocTD25nO
కొన్ని రోజుల కిందట కురిసిన వర్షాలకు తెలంగాణలోని కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలతో ఏర్పడిన పంటనష్టాన్ని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తామని చెప్పింది. నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని, యూరియా కొరత సమస్య పరిష్కారించాలని కేంద్ర మంత్రులు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాను కలిసి నివేదికలు ఇవ్వనున్నారు. పెండింగులో ఉన్న వివిధ పథకాల నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు.






















