Laxminarayana: సేంద్రీయ సాగులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, స్వయంగా పొలంలో నాట్లు!
Laxminarayana: కాకినాడ జిల్లాలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. కౌలుకు తీసుకున్న పొలంలో స్వయంగా నాట్లు వేసి అందిరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
CBI EX JD Laxminarayana: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, రాచపల్లి గ్రామ పరిధిలో ఉన్న పన్నెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ వరి నాట్లు వేశారు. గత కొన్నేళ్లుగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని లక్ష్మీనారాయణ కౌలుకు తీసుకున్ని సాగు చేస్తుండగా పూర్తిగా సేంద్రీయ పద్దతిలో మాత్రమే పంటలు పండిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసుకున్న కూలీలతో వ్యవసాయ పనులు ప్రారంభించగా కూలీలతో పాటు ఆయన కూడా పొలంలో దిగి నాట్లు వేశారు. దీంతో ఆయన అభిమానులు కూడా పొలంలోకి దిగి నాట్లు వేశారు.
ఆదర్శ వ్యవసాయం చేయాలంటున్న లక్ష్మీ నారాయణ..
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూడా రసాయన ఎరువుల వినియోగం ఎక్కువ అయిందని.. దాని వల్ల సారవంతమైన భూమి నిస్సారంగా మారడంతోపాటు మనం తినే ఆహారం పూర్తిగా విషాహారంగా మారుతోందని లక్ష్మీ నారాయణ వివరించారు. దీనిని నియంత్రించేందుకు రైతులంతా సేంద్రీయ సాగు వైపుకు మళ్లాలని మాజీ జేడీ స్థానిక రైతులకు సూచించారు. మన చేతితో మనకు అందుబాటులో ఉన్న వాటితోనే సేంద్రియ సాగు చేయాలని స్పష్టం చేశారు. సేంద్రీయ సాగు ద్వారా పెట్టుబడులు గణనీయంగా తగ్గడంతో పాటు సారవంతమైన పంటను పొందగలగుతామని, ప్రభుత్వాలు కూడా రైతులను సేంద్రీయ సాగువైపు మళ్లేలా మరింత ప్రోత్సహించాలని సూచించారు. అప్పుడే ప్రజల ఆరోగ్యంతో పాటు అన్నీ బాగుంటాయని వివరించారు.
Paddy transplantation has been carried out in Dharmavaram, Kakinada Dist. Native paddy varieties - Kalabhatti & Mysore Mallika are being grown this time. Thanks to all friends & well wishes for their participation. #naturalfarming pic.twitter.com/VeBWsAZ92f
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) August 17, 2022
వ్యవసాయంపై మక్కువతోనే..
దేశం గర్వించదగ్గ దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో ఉన్నత పదవిని స్వీకరించిన లక్ష్మీ నారాయణ పదవీ విరమణ అనంతరం తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయాన్ని చేయడం చూసిన వారు, అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం, రాచపల్లి గ్రామాల్లో ఏకంగా 12 ఎకరాల భూమిని కౌలు తీస్కొని పూర్తిగా సేంద్రీయ విధానంలోనే పంటలు పండించడం ఆదర్శంగా నిలుస్తోంది. వ్యవసాయానికి దూరం అవుతున్న ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను మరికొందరు తెలుసుకునేలా చేస్తుంది.
ఎన్ని ప్రభుత్వాలొచ్చినా మారని పరిస్థితి..
దేశానికి రైతే రాజు, జై జవాన్, జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు.. వంటి అనేక నినాదాలు ఎన్ని ఉన్నా రైతులకు ఆధారమైన వ్యవసాయ రంగం అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈమధ్య కాలంలోనే పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. రైతుల ఆత్మహత్యలు కాస్త తగ్గాయనే చెప్పొచ్చు. భారత దేశంలో ఇప్పటికీ దాదాపుగా 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
రోజురోజుకు అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నా ఒక్క రైతు పండించిన పంట ధర మాత్రమే పెరగడం లేదు. వస్తువులు తయారు చేసిన వ్యక్తులే ధరలను నిర్ణయిస్తుండగా.. కేవలం రైతు పండించిన పంటకు మాత్రమే ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తున్నాయి. అయితే చాలా మంది రైతులు, కౌలు రైతులు పండించిన పంటకు గిట్టుబాట ధర లేక.. నష్టాల పాలవుతున్నారు. రైతులే తాము పండించిన పంటకు ధర నిర్యించే పరిస్థితి మారిన నాడే అన్నదాతల బతుకులు గాడిలో పడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.