Godavari Floods: గోదారమ్మ ఉగ్రరూపం, జల దిగ్భంధంలో లంక గ్రామాలు!
Godavari Floods : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ధాటికి లంక గ్రామాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పటిక ధవళేశ్వరం ఆనకటట్ వద్ద 14.20 అడుగలకు నీటి మట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు.
Godavari Floods: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంతో దిగువ ప్రాంతాలకు వరద ఉద్ధృతి అంతే స్థాయిలో పెరుగుతోంది. అయితే ఇప్పటికే నదీ పరివాహక లంక గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. ధవళేశ్వరం వద్ద మరింత వరద పెరిగితే లంక గ్రామాలు ముంపు ముప్పులోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. విలీన మండలాల్లోని పలు గ్రామాల్లో వరద పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. చింతూరు, దేవీపట్నం, కూనవరం, మోతుగూడెం తదితర పాంతాల్లో ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే రాజమహేంద్ర వరం వద్ద అఖండ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి, పంట కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.
కోనసీమలోనూ వరద..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, ఐ.పోలవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల పరిధిలో పలు లంక గ్రామాల్లో వరద నీరు క్రమ క్రమంగా చేరుతోంది. పశ్చిమగోదావరి జిల్లా రామరాజులంక, పి.గన్నవరం మండల పరిధిలోకి వచ్చే కనకాయ లంకకు వెళ్లే మార్గంలోని కాజ్వే గోదావరి ప్రవాహానికి ముంపునకు గురయ్యింది. అయినవిల్లి మండలంలోకి ఎదురుబిడిం కాజ్ వే పైకి వరదనీరు చేరింది. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఎనిమిది గ్రామాల పరిస్థితి మరీ దారుణం..!
గోదావరి వరజ ఉద్ధృతితో కోనసీమ ప్రాంతంలోని నదీ పాయల్లో ప్రవాహ ఒరవడి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదలడంతో గొతమి, వశిష్ట, వైనతేయ.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ లంకలు మరోసారి ముంపులో చిక్కుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో కోనసీమ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలు, ముంచుకొచ్చిన గోదావరి వరద కలిసి, కోనసీమ లంక గ్రామాల ప్రజలు కష్టాలను రెట్టింపు చేశాయి. జన జీవనం పూర్తిగా స్తంభించింది. ముమ్మిడివరం మండలం పరిధిలోని ఎనిమిది లంక గ్రామాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. రహదారులు నీట మునిగి, నాటు పడవలపైనే జనాలు రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరి తోటల్లో కాయలు వరదకు కొట్టుకుపోకుండా ఒడ్డుకు చేరుస్తున్నారు.
వరదలో చిక్కుకొని ఒకరు గల్లంతు..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాటికాయల వారి పాలెం సమీపంలోని జిల్లేడు లంక వద్ద వరద ప్రవాహంలో చిక్కుకొని ఒక రైతు గల్లంతు అయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజు పాలేనికి చెందిన కౌలు రైతు జివ్వాది నరసింహారావు.. జిల్లేడు పంకలో పదేళ్లుగా తమలపాకు సాగు చేస్తున్నారు. జులైలో వచ్చిన వరద పంటను తుడిచి పెట్టేసింది. పొలంలో ఉన్న కలపను జాగ్రత్త చేసేందుకు వెళ్తుండగా.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. భద్రాచలం వద్ద వరద తగ్గుతున్నప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం మరో రెండు రోజుల పాటు వరద ఉద్ధృతి నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.