పింఛన్ పీకేశారు- చావుకు అనుమతించండీ- కలెక్టర్‌కు ఓ మహిళ విన్నపం
చనిపోయిన భర్త ఐటీ కడుతున్నాడట.. వితంతువు పింఛన్ పీకేసిన అధికారులు- దీంతో బతికే దారి లేదని తన చావుకు అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నారు ఆ మహిళ.
వచ్చే నెల నుంచి ఏపీలో పింఛన్ల సొమ్ము పెరగనుంది. అదే టైంలో వివిధ కారణాలతో కోతలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో లబ్ధిదారులు రోడ్డెక్కుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ మహిళ కలెక్టర్‌కు లెటర్ రాశారు. తాము చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు.
కలెక్టర్ గారూ మా కుటుంబం కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ ఒక మహిళ కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు. ఇక జీవించలేను చనిపోయేందుకు అనుమతి ఇవ్వమని వేడుకుంటున్నారు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొమానపల్లికి చెందిన సత్యశ్రీ. ఆమె భర్త శ్రీనివాస్ నాగపూర్‌లో ఒక ఫ్యాక్టరీలో సూపర్ వైజర్‌గా పని చేసేవాళ్లు. ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూల్‌లో చదివించేవారు. ప్రభుత్వానికి ఆదాయ పన్నుకూడా కట్టేవారు.
హ్యాపీగా ఉన్న టైంలో శ్రీనివాస్ ఆరోగ్యం దెబ్బతింది. కుటుంబంతో షిర్డీ చేరుకొని అక్కడ ఇంకో కంపెనీలో పనికి చేరారు. అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో సొంతూరికి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తరువాత అనేక ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. సంపదంతా ఖర్చు అయిపోయింది. అప్పులు కూడా పెరిగిపోయాయి. అయినా ఆరోగ్యం కుదటపడలేదు. కిడ్నీలు పూర్తిగా పాడవతో మూడు సంవత్సరాల క్రితం శ్రీనివాస్ మృతి చెందాడు.
చిన్న బిడ్డలతో సత్యశ్రీ ఊరిలోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపిస్తోంది. వీళ్లకు అమ్మఒడి పథకం అందలేదు. గతేడాది నుంచి ఆమెకు వితంతు పింఛన్ వస్తోంది. కూలీ పనులకు వెళ్లగా వచ్చిన డబ్బు, పింఛన్ రూపంలో వచ్చే సొమ్ముతో సంసారాన్ని నెట్టుకొస్తోంది.
పరిస్థితులు మారుతున్నాయన్న టైంలో గ్రామం వెల్ఫేర్ అసిస్టెంట్ పిడుగులాంటి వార్త చెప్పారు. ఇకపై పింఛన్ రాదని సత్యశ్రీకి చెప్పారు. మీ భర్త ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడని అందువల్లనే పింఛను నిలిపేశారని చెప్పడంతో కన్నీరు మున్నీరు అయ్యారు. తన భర్త బతికి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పన్ను చెల్లించేవాడని, ఇప్పుడు ఆయనే బ్రతికి లేడని, ఇక నేనెలా బతకాలని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా బాగా లేక పోవడంతో కూలి పనులకు కూడా వెళ్లలేకపోవడం, ప్రభుత్వం తన పింఛను నిలిపి వేయటంతో జీవితంపై విరక్తి వ్యక్తం చేస్తున్నారు.
తాను చనిపోతే తన బిడ్డలు. అనాథలవుతారని భావించి తనతోపాటు తన కుమారులకు కూడా కారుణ్య మరణం పొందేందుకు అనుమతి ఇవ్వాలని, లేదా ప్రభుత్వం తన పింఛను పునరుద్ధరించి, అమ్మవడి అందచేయాలని వేడుకుంటున్నారు. లేని పక్షంలో కారుణ్య మరణం ప్రసాదించమని వేడుకుంటానని చెబుతోంది..
ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడానికి లబ్ధిదారులను తగ్గించుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెంచిన పింఛన్లు అందరికీ ఇవ్వాల్సింది పోయి... కోత పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నాయి. వైసీపీకి అనుకూలంగా లేరనో... వేరే పార్టీలకు సానూభూతిపరులుగా ఉన్నారనో కసితో... ఏవేవో కారణాలతో పింఛన్లు తొలగిస్తున్నారని మండిపడుతున్నారు.
Also Read:జనవరి 27న విశాఖలో ‘ప్రజా గర్జన’ బహిరంగ సభ: స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ
Also Read: ఎన్నికల ముందు మద్యపాన నిషేధం విధించే అవకాశం! - డిప్యూటీ స్పీకర్ కోలగట్ల