Vizag Steel Plant: జనవరి 27న విశాఖలో ‘ప్రజా గర్జన’ బహిరంగ సభ: స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ
32 మంది అమరవీరుల త్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు.
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు. వచ్చే ఏడాది జనవరి 27న విశాఖపట్టణంలో లక్ష మందితో ‘ప్రజా గర్జన’ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు. ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. వచ్చే జనవరి 27న ‘ప్రజా గర్జన’ సభ నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమరవీరుల త్యాగానికి ప్రతీక అన్నారు.
32 మంది అమరవీరుల త్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు చెప్పారు. కరోనా వ్యాప్తి లాంటి ప్రమాకరమైన రోజుల్లో సైతం స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారని గుర్తుచేశారు. మనకు సొంత మైన్స్ లేకపోయినా లాభాల బాటలో నడిపించారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరు, దేశానికే తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ అని నేతలు వివరించారు. తమిళనాడులో ప్రతి ఏడాది ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్వహించుకునే జల్లికట్టు తరహాలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సైతం ఆదర్శంగా తీసుకుని కేంద్ర వైఖరిని వ్యతిరేకించే శక్తులు ఏకమై విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు.
స్టీల్ ప్లాంట్ భూములపైనే పెద్దల కన్ను: కార్మిక సంఘాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం దానికి ఉన్న భూములే అంటారు ఇక్కడి కార్మికులు. ప్లాంట్ విస్తరణ, భవనాల నిర్మాణం పోగా ఇంకా 8 వేల ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్‌ది ఖాళీగా ఉంది. దాన్ని చేజిక్కించుకునేందుకే ప్రైవేటు కంపెనీలు స్టీల్ ప్లాంట్ పై కన్నేసాయనేది వారి వాదన. వీటి విలువ దాదాపు లక్ష కోట్ల వరకూ ఉండడంతో వాటిపై ఆధిపత్యం కోసమే ఈ కుట్ర జరుగుతుంది అంటారు వాళ్ళు. విచిత్రంగా ఇప్పుడు కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని చూస్తున్న పోస్కో కంపెనీ గతంలో ఒడిశాలో ప్లాంట్ కోసం ప్రయత్నిస్తే ప్రాజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి అదే కంపెనీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా అప్పగిస్తారని కేంద్రాన్ని అడిగితే మాత్రం జవాబు లేదని ఉద్యోగ కార్మిక సంఘాలు అంటున్నాయి.
జాతీయ స్థాయిలో దద్దరిల్లిన నినాదం -" ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు "
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక ప్రాంతానికి చెందినది కాదు. దీని ఏర్పాటు కోసం ఆంధ్రులంతా ఏకతాటిపై పోరాటం చేశారు. 1966లో గుంటూరు ప్రాంతానికి చెందిన టి.అమృతరావు విశాఖలో దీక్ష ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో దీనిలో పాల్గొన్నారు. తరగతుల బహిష్కరణ, ఆందోళనలతో నిరసనలు పెద్ద ఎత్తున సాగాయి. రాజకీయ పక్షాలు కూడా విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి. 1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో 9మంది మరణించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. అవి కూడా పోలీసు కాల్పులకు దారితీశాయి. ఈ కాల్పుల్లో అదిలాబాద్, వరంగల్, విజయవాడ, విజయనగరం, తగరపువలస, కాకినాడ, సీలేరు, గుంటూరులలో మొత్తం 23 మంది మరణించారు. విశాఖతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు.