Somu Veerraju : ఏపీకి అమరావతే రాజధాని, అధికారమిస్తే ఐదేళ్లలో నిర్మిస్తాం- సోము వీర్రాజు
Somu Veerraju : ఏపీకి అమరావతే రాజధాని అని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రాజధాని నిర్మిస్తామన్నారు.
Somu Veerraju : ఏపీకి అమరావతే రాజధాని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. బీజేపీకి అధికారం ఇస్తే ఐదేళ్లలో అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వానికి రాజధాని కోసం ఇచ్చిన రూ.9 వేల కోట్లు ఏమాయ్యాయో తెలియలేదన్నారు. అమరావతిలోనే రాజధాని కడతానన్న సీఎం జగన్ మడమ తిప్పారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టే కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీలను వ్యతిరేకిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
"ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ పోటీ చేస్తుంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో ఆలోచిస్తుంది. అన్ని ప్రాంతాల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. రాజమండ్రిలో ఎయిర్ పోర్టు అభివృద్ధికి రూ.300 కోట్లు కేంద్రం ఇచ్చినట్లు చదివాను. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.10 వేలు కోట్లు ఇచ్చారు. ఉపాధి హామీ కింద రూ.75 వేల కోట్లు ఇచ్చారు. కేంద్రం ఇప్పటి వరకూ ఏపీకి రూ.8.55 లక్షల కోట్లు ఇచ్చింది. రాజమండ్రికి వివిధ పథకాలకు రూ.90 కోట్లు ఇచ్చారు. జగన్ సంక్షేమానికి మించిన సంక్షేమాన్ని మోదీ ప్రభుత్వం చేస్తుంది. " - సోము వీర్రాజు
రాజధానిపై ప్రజాభిప్రాయం మేరకు వెళ్లాలి - వెంకయ్య నాయుడు
రాజధానిపై ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్లాలని మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఒక విద్యార్థి రాజధానిపై వెంకయ్య ను ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనన్నారు. అమరావతిపై తన అభిప్రాయం ముందే చెప్పానన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్నానన్నారు. పట్టణాభివృద్ధి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానన్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందంటూ వెంకయ్యనాయుడు క్లారిటీ ఇచ్చారు.
గతంలో పూర్తి మద్దతు
ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత వెంకయ్యనాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెబుతున్నారు. అందుకే ఆయన రాజకీయ పరమైన ప్రకటనలు చేయడం లేదని తెలుస్తోంది. అయితే విద్యార్థులకు ఇచ్చిన సమాధానంలోనే ఆయన అసలు తన వైఖరి కూడా చెప్పారని అర్థం చేసుకోవచ్చు. అమరావతి విషయంలో గతంలో ఆయన పూర్తి మద్దతుగా ఉండేవారు. తన మంత్రిత్వ శాఖ నుంచే కాదు.. బీజేపీలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఇతర విధాలగానూ అమరావతికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. అందుకే తాను అమరావతి కోసం చేసిన పనులను గుర్తు చేసి మీకు అర్థమై ఉంటుందని విద్యార్థులతో చెప్పారని అర్థం చేసుకోవచ్చు. 2015లో అప్పటి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం కాలేదు. అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఫలానా ప్రాంతానికి రాజధాని కావాలని ఎక్కడా డిమాండ్లు కూడా రాలేదు. గత ఎన్నికల ముందు కూడా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేస్తామని వైసీపీ కూడా ప్రకటించింది కానీ అనూహ్యంగా గెలిచిన తర్వాత మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చారు. దీంతో ఒక్క సారిగా రాజధాని వివాదం ప్రారంభమయింది .అది ఇంకా కొనసాగుతోంది. సాంకేతికంగా ఇప్పటికీ అమరావతే రాజధాని. అయితే ప్రభుత్వమే అమరావతిని రాజధానిగా అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోవడం.. పదే పదే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వస్తూండటంతో ఇదో హాట్ టాపిక్ గా ఉండిపోయింది.