Andhra Pradesh: ఎన్నికల నగరా మోగించనున్న బీజేపీ, కురుక్షేత్ర యుద్ధానికి పురందేశ్వరి సై!
Pudandeswari: ఏపీ ఎన్నికల నగరా మోగించనున్న బీజేపీ, కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమంటున్న పురందేశ్వరి
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది, ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే నేరుగా రంగంలోకి దిగి ప్రజాక్షేత్రంలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం మొదలుపెట్టేశాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీలో అప్పుడు యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ప్రధాని ప్రత్యర్థులు ఇద్దరూ ఎన్నికల సమరాన్ని కురుక్షేత్రంతో పోలుస్తూ మాటల దాటిని పెంచేశారు. అటు అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, పోతలు, అలకలు, రాజీనామాలతో ఏపీ ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకుని పదేళ్ల కిందటే అడ్రస్ గల్లంతయిన కాంగ్రెస్.. షర్మిల(Sharmila) రాకతో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఇంత జరుగుతున్నా... కేంద్రంలో అధికారంలో ఉండి, మళ్లీ తమదే అధికార పీఠమని ఢంకా బనాయించి మరీ చెబుతున్న బీజేపీ( Bjp) మాత్రం ఎక్కడా కనిపించడం లేదేంటని నిరూత్సాహంలో ఉన్న కమలదళంలో ఊపు తెచ్చేలా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Pudandeswari) కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి మనమూ సిద్ధమంటూ ఫిబ్రవరి 1 రాష్ట్రవ్యాప్త్గా ఒకే బీజేపీ ఎన్నికల కార్యాలయాల ప్రారంభించనున్నారు.
యుద్ధానికి మేము సిద్ధం
బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి(Pudandeswari) ఎన్నికల నగరా మోగించనున్నారు. ఫిబ్రవరి 1 న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో బిజెపి(Bjp) ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం ద్వారా ఆమె శ్రేణులను ఎన్నికలు సిద్ధం చేయనున్నారు. ఒకేసారి 25 లోక్ సభ కార్యాలయాలను బటన్ నొక్కి ఏక సమయం లో ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. పార్టీ రెండుసార్లు విజయం సాధించిన నరసాపురం(Narasapuram)లో లోక్‌సభ కార్యాలయాన్ని భీమవరం(Bhimavaram)లో ఆమె స్వయంగా ప్రారంభించనున్నారు. భీమిలిలో భారీ బహిరంగ సభ ద్వారా సీఎం జగన్ ఎన్నికల నగరా మోగించగా, రా...కదలి రా అంటూ చంద్రబాబు(ChandraBabu) అంతకు ముందే ప్రజాక్షేత్రంలోకి దూకారు. ఇక షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వీటికి దీటుగానే భాజపా బలం చూపించేలా భీమవరంలో భారీగా ఐదు కిలోమీటర్ల మేర బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించనుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భీమవరం నగర వీధలన్నీ కాషాయమయం చేశారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఆ పార్టీకి బలం ఉంది. గతంలో రెండుసార్లు ఈ స్థానాన్ని భాగస్వామ్య పక్షాలతో కలిసి బీజేపీ కైవసం చేసుకున్న చరిత్ర ఉంది.
ఏపీలో మార్పు తథ్యం
ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..వైకాపా అవినీతి పాలన నుంచి విముక్తి కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Pudandeswari) అన్నారు. ప్రజాసంక్షేమం పేరిట కేవలం అధికార పార్టీ ఓటు రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలో గత పదేళ్లలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ (Bjp) అవినీతి రహిత పాలన అందిస్తోందని...దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని ఆమె గుర్తు చేశారు. కచ్చితంగా రాష్ట్రంలోనూ ప్రజలు అలాంటి పాలనే కోరుకుంటున్నారని ఆమె అన్నారు. అయోధ్య భవ్య మందిరం నిర్మాణం, బాలరాముని ప్రాణప్రతిష్ఠ దేశ ప్రజల మనసును తాకిందన్నారు. కచ్చితంగా ఈసారి రాష్ట్రంలో మెరుగైన సీట్లు గెలుచుకోబోతున్నామని ఆమె దీమా వ్యక్తం చేశారు.
తేలని పొత్తుల వ్యవహారం
అయితే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి గెలిచేంత బలం బీజేపీ(Bjp)కి లేదు. కాబట్టి ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ పొత్తు కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. గతంలోనూ కలిసి నడిచిన తెలుగుదేశంతో పొత్తుపెట్టుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. పైగా తమ మిత్రపక్షం జనసేన సైతం ఇప్పటికే తెలుగుదేశం(Tdp)తో కలిసి నడవనుండటంతో తమకు మార్గం సుగమం కానుంది. దీనికి అనుగుణంగానే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి చంద్రబాబును ఆహ్వానించడం ఆయన హాజరవ్వడం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా పొత్తుల వ్యవహారం తేలలేదు. ఇప్పటికే జనసేనతో సీట్ల పంచాయితీ తేలక తెలుగుదేశం కొట్టుమిట్టాడుతోంది.
వైసీపీ నుంచి వస్తున్న వలసదారులకు హామీ ఇవ్వలేకపోతోంది. ఇప్పుడు బీజేపీకి సైతం సీట్లు కేటాయించాలంటే కొంచెం కష్టమైనే పనే. అయితే పొత్తుల వ్యవహారం మొత్తం భాజపా కేంద్ర అధిష్టానం చూసుకుంటుందని...తాము మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతామని పురందేశ్వరి తెలిరపారు. వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి ఇటీవలే దరఖాస్తులు సైతం స్వీకరించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుమారు రెండు వేల మంది దరఖాస్తు చేశారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి అయిదు నుంచి పది మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు.