Nellore News: నెల్లూరు జిల్లాలో విష జ్వరాల విజృంభణ - ప్రజల ఆందోళన
Poisonous Fevers: నెల్లూరు జిల్లాలో విషజ్వరాల విజృంభణతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య సేవలు మెరుగుపరచాలని.. వైద్య సేవలు అందేలా చూడాలని కోరుతున్నారు.
Poisonous Fevers in Nellore District: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో విషజ్వరాల విజృంభణతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నూతక్కివారి కండ్రిగలో ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరాలతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది నెల్లూరు వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజుల నుంచి జ్వరాలు తగ్గకపోవడంతో.. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సరిగా లేకపోవడం వల్ల దోమలు విపరీతంగా విజృంభిస్తున్నాయని.. ఒళ్లు నొప్పులతో కూడిన జ్వరాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ జ్వరాలేమోనని ఆందోళన చెందుతున్నామని అన్నారు. దీనికి తోడు దుర్గంధం భరించలేకపోతున్నామని వాపోయారు. జ్వరాలు ప్రబలకుండా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని.. బాధితులకు వైద్య సేవలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మరోవైపు, నెల్లూరు జిల్లాలోనే వేలాది కోళ్లకు వైరస్ సోకి ఇటీవలే మృత్యువాత పడడం కలకలం రేపింది. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో వేలాది కోళ్లు చనిపోయాయి. వీటిని పరిశీలించిన అధికారులు బర్డ్ ఫ్లూతోనే మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఈ నేపథ్యంలో కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కి.మీల పరిధిలోని ప్రాంతాల్లో 3 రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని.. కిలో మీటర్ పరిధిలోని ప్రాంతాల్లో చికెన్ షాపులు 3 నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్దేశించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాపు యజమానుల్లో చైతన్యం తేవాలని.. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని సూచించారు. వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
కీలక ప్రకటన
కాగా, అక్కడ కోళ్లకు వచ్చిన వ్యాధిని ఏవియన్ ఇన్ ఫ్లుయెంజాగా (బర్డ్ ఫ్లూ - Bird Flu) గుర్తించినట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ కీలక ప్రకటన చేసింది. భోపాల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యూనిమల్ డిసీజెస్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపామని.. ఫలితాలతో ఈ నిర్థారణకు వచ్చామని శనివారం పేర్కొంది. దీంతో కోళ్లు చనిపోయిన గ్రామాలకు కిలోమీటర్ దూరంలో ఇన్ఫెక్టెడ్ జోన్ గా ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఈ వ్యాధి నెల్లూరు జిల్లాలోని 2 గ్రామాల్లో తప్ప ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేశారు. వైరస్ విస్తరించకుండా తగు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, అటవీ, పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో 712 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ బృందాలు నిరంతరం మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు.
టోల్ ఫ్రీ నెంబర్
చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశామని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు. వైరస్ ప్రభావిత గ్రామాలకు చుట్టూ కిలో మీటర్ వరకూ ఇన్ఫెక్టెట్ ప్రాంతంగా, 10 కిలో మీటర్ల వరకూ సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించినట్లు చెప్పారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలను కట్టడి చేశామని అన్నారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో కోళ్లలో అసాధారణ మరణాలు తగ్గినట్లు పేర్కొన్నారు. కోళ్లు అధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వలస పక్షులు వచ్చే నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ అదుపులోనే ఉందని.. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే 1962 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయాలని సూచించారు.
Also Read: Medaram Jatara: మేడారం జాతర చూసేందుకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం