Perni Nani Percentage : పర్సంటేజీలపై పేర్ని నాని సూక్తులు.. బాధ్యతా..! బాధ్యతా రాహిత్యమా..?
అభివృద్ది పనులు చేసి బిల్లులు మంజూరు చేసుకోవాలంటే అధికారులకు పర్సంటేజీలు ఇవ్వాలని మంత్రి పేర్ని నాని అన్నారు. అందుకే సర్పంచ్‌లు పనులు చేయవద్దని సలహా కూడా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( పేర్ని నాని ) ప్రభుత్వ పనుల్లో అందరికీ పర్సంటేజీలు ఇచ్చుకోవాల్సిందేనని ఖరాఖండిగా ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని ఈ పర్సంటేజీల గురించి బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. " సర్పంచ్‌గా ఉండి సొంత పంచాయతీలో పనులను మీరు చేయవద్దు. మీరు గబ్బుపట్టి పోవడానికి ప్రధాన కారణం పనులు చేయడమే. సర్పంచ్ పనులు చేస్తే... చేసిన పనులలో పర్సంటేజ్ కోసం ఏఈ వదలడు... సీఎంఎఫ్ఎస్ పర్సంటేజ్ ఇవ్వకుండా బిల్లు చేయడు.. ఆయనకు చెల్లించుకుని బిల్లు వచ్చాక పంచాయతీ సెక్రటరీ, ఎండీఓ చెక్కు రాయడు . వాళ్లకూ పర్సంటేజీ చెల్లించాలి. అన్నీ పోగా మీకు మిగిలేదీ, చచ్చేదీ ఏమీ ఉండదు.." అని పేర్ని నాని సర్పంచ్‌లకు హిత బోధ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
కాంట్రాక్టులు చేస్తే పర్సంటేజీలు తప్పించుకోలేరని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు..!
రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుత స్థానంలో ఉన్న పేర్ని నాని... ప్రభుత్వ స్థాయిలో అవినీతిని తగ్గిస్తామని చెప్పాలి. అవినీతి జరగదని భరోసా ఇవ్వాలి. కానీ సర్పంచ్‌లకు మాత్రం ఆయన భిన్నమైన మాటలు చెప్పారు. అవినీతి వ్యవస్థీకృతంగా ఉందని.. దాని నుంచి తప్పించుకోలేరని అందుకే పనులు చేయడం మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇదే అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది. ప్రభుత్వ అధికారుల స్థాయిలో ఎంత మేర అవినీతి వ్యవస్థీకృతం అయిందో చాలా స్పష్టంగా మంత్రికి తెలిసినా ఆయన చూసీచూడనట్లుగా ఉంటున్నారు.. ఇంకా తన మాటల ద్వారా ప్రోత్సహిస్తున్నారు కానీ దాన్ని తగ్గించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా ఆ పర్సంటేజీలు అధికారులు తీసుకోవడం తప్పని కూడా ఆయన చెప్పలేదు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపేర్ని నాని... నిజంగా అలాంటి పర్సంటేజీలు అన్ని చోట్లా ఆనవాయితీగా వస్తున్నాయని తెలిస్తే... వాటిని అరికట్టడానికి చేయాల్సినంత ప్రయత్నం చేయాలి. కానీ మంత్రిగా ఉండి.. లంచాలు తీసుకునేవారిని ఏమీ చేయలేమని.. వారికి పర్సంటేజీ ఇవ్వడం కన్నా పనులు చేయడం మానేయమని సలహా ఇవ్వడం ... అందర్నీ ఆశ్చర్య పరిచింది.
Also Read: Galla AmaraRaja : సమాజానికి తిరిగివ్వడానికే పరిశ్రమ..! అమరరాజా వ్యవస్థాపకుని ప్రస్థానం ఆయన మాటల్లోనే..
అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మంత్రిపై విమర్శలు..!
అయితే పేర్ని నాని వాస్తవిక దృక్పథంతో మాట్లాడారని మరికొంత మంది వాదిస్తున్నారు. అవినీతి అంతం అనేది సాధ్యం కాదని తేలిపోయిందని... ఎంత కట్డి చేస్తే అంత పెరిగిపోతుందని కొంత మంది ఉదాహరణలు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారుల కట్టడికి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎందుకు కట్టడి కాలేదని చెబుతున్నారు. ఈ విషయంలో పేర్ని నాని బాధ్యతగా మాట్లాడారని అంటున్నారు. సర్పంచ్‌లుగా గెలిచిన వారు అత్యధికులు వైసీపీ వారే. వారు .. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి ప్రభుత్వానికి బిల్లులు పెట్టుకుంటారు. పనులన్నీ సర్పంచ్‌లు.. వారి బంధువులే చేసుకుంటారు. ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకుని.. మళ్లీ అభివృద్ధి పనులకు ఖర్చులు పెట్టుకుని ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడతారని.. అందరికీ పర్సంటేజీలు కట్టుకుని చివరకు పూర్తిగా నష్టపోతారన్న ఉద్దేశంతోనే పేర్ని నాని చెప్పారని.. అవినీతిని సమర్థించడం కాదని వైసీపీకి చెందిన కొంత మంది నేతలు వాదిస్తున్నారు. ఈ అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.
వాస్తవిక దృక్పథంతో మాట్లాడారని మరికొంత మంది వాదన..!
మంత్రి పేర్ని నానికి ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతూ ఉంటాయి. అయితే వాటిలో తప్పేముందని సమర్థించేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇప్పుడు అవినీతి... పర్సంటేజీల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపైనా ఇలాగే డిబేట్ జరుగుతోంది. కానీ ఆయన మంత్రి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన పర్సంటేజీలు తప్పవని చెప్పడం వల్ల అవినీతి అధికారులకు మరింత ధైర్యం వస్తుంది.. ప్రభుత్వానికి తెలిసే తాము చేస్తున్నామని అభిప్రాయానికి వస్తారు. దాని వల్ల మరింతగా అవినీతి అధికారులు బరి తెగించే ప్రమాదం ఉంది. పేర్ని నాని మంత్రి పదవి లేనప్పుడు ఇలా మాట్లాడితే పెద్ద వివాదం కాదు కానీ.. బాధ్యతాయుత పదవిలో ఉండి వ్యాఖ్యలు చేయడం వల్లే సమస్య వస్తోంది. అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
Also Read: Raghurama Vs YSRCP: ఎయిడెడ్ విద్యాసంస్థల్ని తాకట్టు పెట్టి రూ. లక్ష కోట్ల అప్పు.. ఏపీ సర్కార్‌పై రఘురామ ఆరోపణలు