Minister Jogi Ramesh Challenge : ఏ జగనన్న కాలనీ అయినా ఓకే, ప్లేస్ మీరు చెప్పినా నన్ను చెప్పమన్నా సరే- మంత్రి జోగి రమేష్ సవాల్
Minister Jogi Ramesh Challenge : 74 ఏళ్ల వయసులో చంద్రబాబు పిల్ల చేష్టలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ కు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.
Minister Jogi Ramesh Challenge : ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఛాలెంజ్ లు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ లు విసిరారు. వైసీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లు, తెచ్చిన పరిశ్రమల ముందు సీఎం జగన్ సెల్ఫీ తీసుకోగలరా అని ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ పై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు సవాల్ కు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి జోగి రమేష్ అన్నారు. రాష్ట్రంలోని ఒక కోటి 50 లక్షల ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తుందని, వాటిని చూసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారో లేరో చెప్పాలన్నారు. జగనన్న కాలనీల నిర్మాణాలు ఎలా ఉన్నాయో చూడటానికి రావాలని ఛాలెంజ్ విసిరారు. లోకేశ్ కు పనీపాటా లేక రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల సీఎం జగన్ పాలన, 14 ఏళ్ల చంద్రబాబు పాలనపై చర్చకు సిద్ధమన్నారు.
చంద్రబాబు పిల్ల చేష్టలు
నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి, వాటిని ట్వీట్ చేసిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ ట్వీట్లపై మంత్రి మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ... ఇవన్నీ పిల్ల చేష్టల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా పిచ్చి వాగుడు మానుకుంటే మంచిదన్నారు. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించాలని సూచించారు. 74 ఏళ్ల వయసు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. తాను చేయని పనిని, చేసినట్లుగా చెప్పుకుంటూ సెల్ఫీలు దిగుతున్నారని విమర్శించారు. దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో పునాదులకే పరిమితమైన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని, మౌలిక సదుపాయలు కల్పించిందని స్పష్టంచేశారు. దాన్ని చంద్రబాబు ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గుచేటు అన్నారు. టిడ్కో ఇళ్లు, షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో చంద్రబాబు హంగామా చేసి, చివరకు పేదల మీద అప్పుల భారం వేశారని, అయితే సీఎం జగన్ ఆ భారాన్ని తగ్గించి పేదవాళ్లకు ఇళ్లు అందించే కార్యక్రమం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు, లోకేశ్ కు సవాల్
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలుకావడంలేదని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. పెడన నియోజకవర్గంలో 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారన్నారు. బటన్ నొక్కగానే అక్కచెల్లెమ్మలు, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. అందుకే గడప గడపకూ వెళ్లి ప్రభుత్వంపై ఎంత సంతృప్తిగా ఉన్నారో అడిగి తెలుసుకుంటున్నామన్నారు. చంద్రబాబు, లోకేశ్ కు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. ఇద్దర్లో ఎవరైనా తన సవాల్ స్వీకరించాలన్నారు. లోకేశ్ పాదయాత్రకు వస్తానన్న మంత్రి జోగి రమేష్... ఏ జగనన్న కాలనీ అయినా ఓకే అన్నారు. ప్లేస్ మీరు చెప్పినా ఓకే నన్ను చెప్పమన్నా సరే అంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో కోటిన్నర గడపలకు వెళ్లటానికి చంద్రబాబు, లోకేశ్ సిద్ధమా? అని నిలదీశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూలిపోతారన్నారు. వచ్చే ఎన్నికల్లో 151 కన్నా ఎక్కువ స్థానాలతో మళ్లీ వైసీపీ గెలుస్తుందన్నారు. 175 స్థానాల్లో సైకిల్ గుర్తు పై అభ్యర్థులను పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సీపీఐ నారాయణ, పవన్ కల్యాణ్ అందరూ టీడీపీతో అంటకాగుతున్న సన్నాసులే అని తీవ్రవిమర్శలు చేశారు.