Janasena Rythu Bharosa Yatra: నేడు అనంతపురం జిల్లాకు పవన్ కళ్యాణ్ - ఆ రైతుల కుటుంబాలకు లక్ష ఆర్థికసాయం
Pawan Kalyan Tour In Anantapur: ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర నేడు అనంతపురం జిల్లాలో ప్రారంభించనుంది.
Janasena Rythu Bharosa Yatra: పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జనసేన కౌలు రైతు భరోసా యాత్ర నేడు ప్రారంభిస్తోంది. నేడు అనంతపురం నుంచి రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రాష్ట్రంలో 1019 మంది , రెండో ఏడాది 889 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్సీఆర్బీ (NCRB)కి ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెడుతోందని చెప్పారు. రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ నేడు (మంగళవారం) ప్రారంభించనున్నారు. ఈ యాత్ర కోసం 12వ తేదీ ఉదయం 9 గంటలకు పవన్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తారు పవన్ కల్యాణ్. ఉదయం గం.10.30 నిమిషాలకు కొత్త చెరువు నుంచి బయలుదేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తారు. గం.11:20 నిమిషాలకు ధర్మవరం నుంచి బయలుదేరి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి చేరుకుంటారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది.
జనసేన రైతు భరోసా యాత్ర వివరాలు pic.twitter.com/ppaEa6Df1z
— JanaSena Shatagni (@JSPShatagniTeam) April 11, 2022
బాధిత కుటుంబాలకు భరోసా
గొట్టూరులో మరో రైతు కుటుంబాన్ని పవన్ పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్థిక సాయం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం గం. 12.10 నిమిషాలకు బయలుదేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో సుమారుగా 20 రోజుల క్రిందట ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్ధిక సహాయం అందచేస్తారు. చివరిగా 3 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేసి అక్కడ నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరి కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్థిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. గ్రామసభ అనంతరం హైదరాబాద్ కు బయలుదేరి వెళతారు.