NTR: తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ - హృదయ పూర్వక నీరాజనమంటూ పవన్ కల్యాణ్ ట్వీట్
NTR Birth Anniversary: సమాజ సేవ, చారిత్రక నిర్ణయాలతో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ప్రజల్లో నిలిచారని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు.

Pawan Kalyan Pay Tribute To NTR: తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో ఆయన తనదైన ముద్ర వేశారని అన్నారు.
'ప్రజల గుండెల్లో నిలిచారు'
తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నీరాజనం. ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, సంపూర్ణ రామాయణం వంటి అనేక చిత్రాలలో అజరామర నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారు. "సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు" అనే అక్షర సత్య ఆలోచన, రాజకీయాల పట్ల ఎన్టీఆర్ గారి దృక్కోణాన్ని తెలియచేస్తుంది.
రూ.2కు కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులో వాటా, విద్యావకాశాల విస్తరణలో భాగంగా ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభించడం, ఈ రోజు మహానాడు జరిగే కడప ప్రాంతానికి నీళ్లు అందించే తెలుగుగంగ ప్రాజెక్ట్ వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో ఎన్టీఆర్ గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం కాన్సర్ ఆసుపత్రి ప్రజా సేవలో ఆయన విజన్‌ను ఈ రోజుకీ కొనసాగిస్తోంది. ఈ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి ఆదర్శాలను స్మరించుకుంటూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, సమైక్యతను కాపాడుకుంటూ, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి అని ఆకాంక్షిస్తున్నాను.' అంటూ పవన్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.
తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నీరాజనం. ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, సంపూర్ణ…
— Pawan Kalyan (@PawanKalyan) May 28, 2025
Also Read: కోపంగా చూడొద్దలా.. పేలబోయే ఫిరంగిలా.. - 'హరిహర వీరమల్లు' నుంచి 'తారా తారా' సాంగ్ అదుర్స్
మరోవైపు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియార్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వచ్చి పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. అక్కడే కాసేపు కూర్చుని తాతతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. సినీ రంగానికి ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఓ మహా నాయకుడిగా ఎదిగిన తీరును నెమరువేసుకున్నారు.
అటు.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సైతం ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ ట్వీట్ చేశారు. చరిత్రలో స్థానం సంపాదించుకోవడమే కాదు.. చరిత్ర సృష్టించిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. 'సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పారన్నారు.





















