Pawan Chandrababu Meet : మరోసారి చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ - తాజా రాజకీయాలపై చర్చ !
మరో సారి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు.
Pawan Chandrababu Meet : జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబును కలవడం ఇది మూడో సారి. ఓ సారి విజయవాడ హోటల్‌లో కలిశారు. అప్పుడు చంద్రబాబే పవన్ వద్దకు వెళ్లారు. తర్వాత పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంటికి వచ్చారు. ఇప్పుడు మరోసారి వచ్చి సమావేశం అయ్యారు. పవన్ .. చంద్రబాబు ఇంటికి వచ్చే వరకూ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రెండు పార్టీలు కలిసి పని చేసే అంశంపై వీరిద్దరూ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత ఏపీలో రాజకీయ మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వీరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమతోనే ఉన్నారని బీజేపీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతోనే ఉన్నామని చెబుతున్నారు కానీ కలిసి పోటీ చేస్తామన్న విషయంపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. కేంద్ర బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర నేతలతో సంప్రదించడం లేదు. బీజేపీ ... జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ప్రకటిస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రయత్నిస్తున్నామని ఓట్లు చీలికను అంగీకరించబోమని అంటున్నారు. ఇలాంటి సమయంలో.. జనసేన, టీడీపీ మధ్య సంప్రదింపులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం మొదలైంది. హైదరాబాద్ లోని శ్రీ చంద్రబాబు గారి నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. pic.twitter.com/73egeO8hx5
— JanaSena Party (@JanaSenaParty) April 29, 2023
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ విపక్ష నేతల పర్యటనలకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం ఇరువురి నేతల్లో వ్యక్తమవుతోంది. యర్రగొండపాలెం ఘటనలో చంద్రబాబుపై రాళ్ల దాడికి పక్కా స్కెచ్ వేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలపై పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు సంఘిభావం తెలిపినట్లుగా చెబుతున్నారు. వీరి మధ్య పొత్తు చర్చలు జరిగాయా.. లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వంపై కలిసి పోరాటం చేయడానికే మొగ్గు చూపుతున్నామని ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి ఆలోచిస్తామని గతంలో వీరు ప్రకటించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొని చంద్రబాబును ప్రశంసించి వెళ్లారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆయనపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీని ఏమీ అనకపోయినా చంద్రబాబును పొగిడారని చెప్పి ఓ సూపర్ స్టార్‌పై లాంటి వ్యాఖ్యలు చేయడం వైఎస్ఆర్‌సీపీ నేతలకే చెల్లిందన్న చర్చ ఇద్దరి నేతల మధ్య వచ్చిందని చెబుతున్నారు. వీటితో పాటు ఇటీవల ఏపీలో జరిగిన పలు అంశాలపైనా ఇద్దరూ చర్చించినట్లుగా చెబుతున్నారు.