Pawan Kalyan: టీడీపీ ఆఫీసులపై దాడులను ఖండించిన పవన్ కల్యాణ్... ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కీలక వ్యాఖ్యలు
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ దాడులు చూస్తే ఏపీ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని పవన్ ఆరోపించారు.
ఏపీలో రాజకీయాలు రచ్చకెక్కాయి. టీడీపీ కార్యాలయాలపై మెరుపుదాడులు జరిగాయి. టీడీపీ నేత పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ఇలాంటి దాడులు రాష్ట్రానికి మంచిది కాదని పవన్ అన్నారు. ఏపీ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. ఇలాంటి దాడులను పోలీసులు వెంటనే నియంత్రించాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ హిస్టరీలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిది కాదని పవన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు అరాచకాలకు దారి తీస్తాయన్నారు. ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న పవన్... దాడులకు పాల్పడినవారిని వెంటనే శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని కోరారు.
పార్టీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/K9YtQ4hTt9
— JanaSena Party (@JanaSenaParty) October 19, 2021
ఇది దుష్ట సంప్రదాయం : సీపీఐ రామకృష్ణ
టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ప్రతిపక్ష పార్టీపై దాడులకు పాల్పడడం దుష్ట సంప్రదాయమన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను విఘాతం కలిగిస్తాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దాడిని ఖండించిన బీజేపీ
టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను బీజేపీ పార్టీ ఖండించింది. టిడిపి కార్యాలయం, నేతల ఇళ్ల పై దాడులను ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు మంచిది కాదన్నారు. నిందితులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలన్నారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.
Also Read: ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు