Nellore Rebel Anam : ఇంతే విభజిస్తే నెల్లూరు- బాలాజీ జిల్లాలు మరో ఏపీ -తెలంగాణ ! కుండబద్దలు కొట్టిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే...
నెల్లూరు జిల్లా విభజన తీరుపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు- బాలాజీ జిల్లా మధ్య నీటి పంపకంలో ఘర్షణ ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
జిల్లాల విభజన వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ( YSRCP ) కొత్త సమస్యలు సృష్టిస్తోంది. దాదాపుగా ప్రతి జిల్లాలో ఏదో ఓ సమస్య ఉంది . తాజాగా నెల్లూరు జిల్లాలో ( Nellore ) సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy ) జిల్లా విభజనపై అసంతృప్తి స్వరం వినిపించడం ప్రారంభించారు జిల్లాల విభజన శాస్త్రీయంగా, సహేతుకంగా లేదని ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి వెంకటగిరి నియోజకవర్గాన్ని ( Venkatagiri ) బాలాజీ జిల్లాలో ( Balaji District ) కలిపితే నీటిపంపకాల్లో కొట్లాటలు జరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాటి గురించి కనీసం ఆలోచన చేసి ఉంటే ఇలా విభజించేవారు కాదన్నారు. వెంకటగిరిలోని కలవాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా ( Venkatagiri MLA ) ఉన్నారు. ఆయా మండలాల ప్రజలు చేయబోతున్న నిరసనకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. జిల్లాల అశాస్త్రీయ విభజన వల్ల సోమశిల రిజర్వాయర్ నీటి వాటాల్లో గొడవలు జరుగుతాయని... ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలిన్నారు. డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారన్నారు. మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా ప్రజలు సిద్దంగా లేరని ఆనం ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
నాగార్జున సాగర్ డ్యామ్‌పై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య జరుగుతున్న దాడుల మాదిరిగా నెల్లూరు-బాలాజీ జిల్లా పోలీసులకు సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. శాస్త్రబద్ధంగా నీళ్లు, నిధుల గురించి చట్టపరంగా ఆలోచించి జిల్లాల విభజన చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి అశాస్త్రీయ విధానం బాధ కలిగిస్తోందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తదుపరి మూడు మండలాల ప్రజలతో కలసి నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. గతంలో కూడా ఆనం రామనారాయణరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ గళం విప్పుతున్నారు.
జిల్లాల విభజనపై ఆనం అసంతృప్తి వెనుక రాజకీయ కారణాలే ఎక్కువగా ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి. నెల్లూరులో అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఆయనకు ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. సాదాసీదా ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. దీంతో ఆయన అసంతృప్తికి గురవుతున్నారు. పైగా తన నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ( Nedurumalli Ram Kumar Reddy ) నాయకత్వంలో హైకమాండ్ ప్రోత్సహిస్తూండటంతో ఆయన మరింతగా అసంతృప్తికి గురవుతున్నారు. ప్రభుత్వం ఆయన డిమాండ్‌ను పరిష్కరించకపోతే పార్టీని ధిక్కరించి ఆందోళనలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.