Tammareddy Bharadwaja: సినీ కార్మికుల వల్ల నిర్మాత నష్టపోతున్నారా? - ఫిల్మ్ ఫెడరేషన్ లేకుండా సినిమా తీయలేరా?... ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూ
Tammareddy Bharadwaja Interview: యూనియన్ పేరుతో నిర్మాతలకు కార్మికులు భారంగా మారారా.? ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ తో ABP దేశం స్పెషల్ ఇంటర్వ్యూ...

ABP Desam Exclusive Interview With Producer Tammareddy Bharadwaja: గత కొంతకాలంగా సినీ కార్మికులు, ఫిలిం చాంబర్ మధ్య వేతనాల పెంపు అంశంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అసలు కార్మికుల వేతనాలు నిర్మాతలకు భారంగా మారాయా? ఫెడరేషన్, ఫిలిం చాంబర్ మధ్య ఎందుకు ఈ దూరం. ఇండస్ట్రీలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజతో ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...
ఏబీపీ దేశం: మూడేళ్ల తరువాత జీతాలు పెంచండి అనేది మా న్యాయమైన డిమాండ్ అని సినీ కార్మికులు అంటున్నారు. కార్మికుల వల్ల మేం నష్టపోతున్నాం, యూనియన్ల పేరుతో మాఫియా నడుస్తోందని నిర్మాతలంటున్నారు. టాలీవుడ్‌లో కార్మికుల సమ్మె వివాదానికి కారణాలేంటి?
తమ్మారెడ్డి భరద్వాజ: కార్మికులకు జీతాలు పెంచడం అనేది అవసరం. జీతాలు పెరిగి మూడేళ్లు దాటింది కాబట్టి 30 శాతం, లేదా 20 శాతం ఎంతో కొంత జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. నిర్మాతల వాదన కూాడా వాస్తవమే. ఎవరిని పెట్టుకోవాలి, ఎంతమందిని పెట్టుకోవాలని కార్మిక యూనియన్లు చెప్పడం తప్పు. పదేళ్ల నుంచి ఈ వివాదంపై ఎన్నోసార్లు నిర్మాతలకు చెప్పినా పట్టించుకోలేదు. పదేళ్ల క్రితం ఈ సమస్యను తుంచేసి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు. 10 మంది ఆర్టిస్టులు ఉన్న షూటింగ్‌లో దాదాపు 50 మంది స్టాఫ్ వస్తున్నారు. అక్కడ అంతమంది కార్మికులు నిర్మాతకు అవసరం లేదు. ఇన్నాళ్లు ఎందుకు నిర్మాతలు ఈ సమస్యను భరించారు. రెమ్యూనిరేషన్ పెరగడంతో కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాల్సిన పరిస్దితి నిర్మాతకు ఏర్పడింది.
చాలామంది నిర్మాతలు ఆ రోజు వాళ్ల ఇంట్లో వాళ్లు అడిగింది కొని తెచ్చే అవకాశం ఉండదు. కానీ షూటింగ్ సెట్‌లో యూనియన్లు, ఆర్టిస్టుల గొంతెమ్మ కోర్కెలు తీర్చాల్సి వస్తోంది. అందుకే నిర్మాతల కడుపు రగిలిపోతోంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీపై ఆధారపడ్డ కార్మికులు ఓ లక్ష మంది ఉంటే వారిలో రోజూ పని చేయనిదే గడవని కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో కడుపు నిండి వాళ్ల పరిస్దితి ఒకలా ఉంటే, షూటింగ్స్ లేకపోతే పస్తులుండాల్సిన వాళ్ల పరిస్దితి మరోలా ఉంటుంది. కొందరు కార్మికులకు రోజుకు రూ.3 వేలు ఇస్తున్నామని, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జీతాలుగా, కార్మికుల జీతాలు ఉంటున్నాయనే విమర్శలు తప్పు. ఎక్కువ మంది కార్మికులకు నెలకు కనీసం 5 నుంచి 10 రోజులు పని దొరకడమే కష్టంగా మారింది.
ఎవరు అవునన్నా, కాదన్నా.. ఫిల్మ్ ఫెడరేషన్ లేకుండా నిర్మాతలు సినిమాలు తీయలేరు. గతంలో జరిగిన సమ్మె అనుభవంతో నిర్మాతలు ముందుగా జాగ్రత్త పడాల్సింది. కానీ అలా చేయలేకపోయారు. ఫెడరేషన్ నిర్మాతలకు సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు మీరు అక్కర్లేదు, మీ అవసరం లేకుండా మేం షూటింగ్స్ చేయగలం అనే పరిస్దితిలోకి నిర్మాతలు రాలేకపోయారు.
ఏబీపీ దేశం - నిర్మాతలను ఇబ్బంది పెట్టేలా కార్మిక యూనియన్లు వ్యవహరిస్తున్నాయా?. ఇటీవల ఓ నిర్మాత మాట్లాడుతూ 20 మంది షూటింగ్స్ అనుకుంటే 80 మందిని భరించాల్సి వస్తోందంటున్నారు. వాస్తవాలేంటి?
తమ్మారెడ్డి భరద్వాజ - కార్మికులను లెక్కకు మించి భరించే స్దాయిలో ఇప్పుడు నిర్మాతలు లేరు. నాకు ఓ ముగ్గురు కుర్రాళ్లను పెట్టాలి. కారు ఉండాలి. ఓ మేనేజర్ కావాలి. కారు డ్రైవర్, పెట్రోల్, కారు రెంట్ ఇలా ఇవన్నీ నిర్మాతకు భారంగా మారుతోంది. ఇలా ఇవన్నీ కలిపి రోజుకు రూ.20 వేలు అవుతోంది. ఇలా పది రోజులు డబ్బింగ్ చేస్తే లక్షన్నర అవుతోంది. ఒక్క ఫొటో షూట్ పెడితే ఆరుగురు కార్మికుల కావాలంటే , కాదు 30 మంది అయితే వస్తామన్నారట. అది నిజమైతే అలా అనడం కార్మిక యూనియన్ల తప్పు.
ఏబీపీ దేశం - ఈ రోజుల్లో నిర్మాతలకు ఫిల్మ్ ఫెడరేషన్‌కు మధ్య సఖ్యత లేని పరిస్దితి. గతంలో నిర్మాతలు, కార్మికుల మధ్య అనుబంధం ఉండేది. ఇప్పుడున్న నిర్మాతలు ఎవరో తెలియకుండానే కార్మికులతో సినిమా నిర్మిస్తున్నారు. ఎక్కడ తేడా వచ్చింది?
తమ్మారెడ్డి భరద్వాజ - గతంలో సినిమా షూటింగ్ అంటే ఓ మేనేజర్, మహా అయితే ఇద్దరు అసిస్టెంట్స్ ఉండేవాళ్లు. ఈ రోజుల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఆర్టిస్టుకు మేనేజర్, ఆర్ట్ డైరెక్షర్‌కు మేనేజర్, డ్యాన్స్ మాస్టర్‌కు మేనేజర్, ఫైట్ మాస్టర్‌కు మేనేజర్ ఇలా లెక్కలేనంత మందితో అనేంతలా సినిమా షూటింగ్ విధానం మారిపోయింది. కార్వాన్లు లేవు. ఇప్పుడు ఏకంగా కార్వాన్‌కు కూడా ఓ మేనేజర్ ఉంటున్నాడు. 50 ఏళ్ల క్రితం నాతో పని చేసిన ప్రొడక్షన్ బాయ్ పేరు కూాడా నాకు గుర్తుంది.
'మొగుడు కావాలి' సినిమా పూర్తైన తరువాత ఓ రోజు నేను కారులో పెట్రోల్‌కు డబ్బులేక బస్టాండులో నిలబడి ఉన్నాను. నా దగ్గర మేకప్ అసిస్టెంట్‌గా పని చేసిన మాణిక్యం అనే వ్యక్తి ఉండేవాడు. అతని జీతం నెలకు రూ.200 ఉండేది అప్పట్లో. బస్టాండ్‌లో నిలబడి ఉన్న నన్ను చూసి తన జేబులో ఉన్న రూ.50 తీసి, నా జేబులో పెట్టి వేగంగా వెళ్లిపోయాడు. అంతలా కార్మికులతో మంచి సంబంధాలుండేవి. ఈ రోజుల్లో షూటింగ్ పూర్తయితే చాలు ఒకరినొకరు బూతులు తిట్టుకునే పరిస్దితి ఉంది.





















