![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Atmakur By-Elections: ప్రజల్లో కాదు, వైసీపీ నేతల్లోనే అసంతృప్తి - నిజాలు చెప్పేస్తున్న ఏపీ మంత్రులు
ఇటీవల ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మంత్రులు ప్రచారం మొదలు పెట్టారు. నేరుగా జనంలోకి వెళ్లేముందు వారు కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతున్నారు. దీంతో సహజంగానే మనసులో మాట బయటపెడుతున్నారు.
![Atmakur By-Elections: ప్రజల్లో కాదు, వైసీపీ నేతల్లోనే అసంతృప్తి - నిజాలు చెప్పేస్తున్న ఏపీ మంత్రులు YSRCP ministers Reveals Facts about Unhappy of leaders during Atmakur bypoll campaign DNN Atmakur By-Elections: ప్రజల్లో కాదు, వైసీపీ నేతల్లోనే అసంతృప్తి - నిజాలు చెప్పేస్తున్న ఏపీ మంత్రులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/c8e27d243295a8e97a0ec7e32617f907_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Atmakur Bypoll 2022: ఇటీవల ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఏపీ మంత్రులు ప్రచారం మొదలు పెట్టారు. నేరుగా జనంలోకి వెళ్లేముందు వారు కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతున్నారు. దీంతో సహజంగానే మనసులో మాట బయటపెడుతున్నారు. ఇటీవల మంత్రి జోగి రమేష్... ఏఎస్ పేట ప్రచారంలో సొంత పార్టీ నాయకులపైనే సెటైర్లు వేశారు. పక్క పార్టీలవారికి పథకాలు వస్తుంటే, ఆర్థిక సాయం వారికి వెళ్లిపోతుంటే.. వైసీపీ నాయకులు ఇబ్బంది పడుతున్నారని, వారికి అది కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి. ప్రజల్లో ఎక్కడా అసంతృప్తి లేదని, కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తల్లోనే ఇతర పార్టీల వారికి సాయం వెళ్తోందనే అసంతృప్తి ఉందని చెప్పారాయన.
మంత్రి అంబటి నోట అదే మాట
ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు కూడా అలాంటి డైలాగులే కొట్టారు. అంబటి రాంబాబు నెల్లూరు ఇన్ ఛార్జ్ మంత్రి కావడంతో మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణంలో ఖాళీ అయిన ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల్లో ఎక్కడా అసంతృప్తి లేదన్నారు. టైమ్ కి అమ్మఒడి పడిపోతోందని, టైమ్ కి ఠంచన్ గా పింఛన్ సొమ్ము చేతిల్లోకి వస్తోందని, ఇతర పథకాల డబ్బులు కూడా టైమ్ మిస్ కాకుండా జనాలకు వస్తున్నాయని, అందుకే జనాల్లో ఎక్కడా అసంతృప్తి లేదని చెప్పారు అంబటి.
మరి అసంతృప్తి ఎవరిలో ఉంది..?
అసంతృప్తి కేవలం వైసీపీ నాయకుల్లో ఉందని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. ఏపీలో ప్రజలెవరూ అసంతృప్తితో లేరని, కేవలం వైసీపీ నాయకులే అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఆయన, కార్యకర్తల సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరికీ టైమ్ కి అన్ని సంక్షేమ పథకాల డబ్బులు పడిపోతున్నాయని, కానీ వైసీపీ నాయకులు, కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు రావడం లేదని చెప్పారు. ఏపీలో బీజేపీ సైజ్ ఎంత అని ఎద్దేవా చేశారు అంబటి. ఆ పార్టీ ఏపీలో తుస్సు అని వెటకరించారు. వెర్రి పుష్పాలో, మంచి పుష్పాలో వారే తేల్చుకోవాలన్నారు.
అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామం లో వైసీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో ఉండి ఉంటే బీజేపీ కంటికి కూడా కనబడేది కాదని అంబటి విమర్శించారు. వాళ్ళ గుర్తింపు కోసమే వైసీపీ పైన బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారాన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా, దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీ తుస్సే నని ఎద్దేవా చేశారు. లక్ష ఓట్ల మెజారిటీతో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు అంబటి పిలుపునిచ్చారు.
జూన్ 23న ఉప ఎన్నికలు
ఈనెల 23న ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ తరపున భరత్ కుమార్ బరిలో ఉన్నారు. బీఎస్పీ సహా.. ఇతర చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 14మంది ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈనెల 23న పోలింగ్, 26న కౌంటింగ్ జరుగుతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)