Villagers Constructing Bridge : ప్రభుత్వాలు చేయట్లేదని ప్రజలే ముందుకు కదిలారు- వంతెన నిర్మించుకున్నారు
ప్రభుత్వాలు మారినా ఫలితం లేకపోవడంతో చివరకు ప్రజలే ముందుకు కదిలారు. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధుల తీరుతో విసిగి వేసారిన ప్రజలు తామే గుండ్లకమ్మ వాగుపై చిన్న బ్రిడ్జ్ కట్టుకోవాలని నిర్ణయించారు.
ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో రోడ్లు లేవంటే ఓ అర్థముంది, ఎక్కడో కొండ కోనల్లో వాగులపై బ్రిడ్జ్ లు కట్టలేదంటే అవసరమేముందు అనేవాళ్లు కూడా ఉంటారు. కానీ అక్కడ ఉండేది కూడా మనుషులే కదా, వారికి కూడా అవసరాలుంటాయి కదా. అందుకే ఇంకా కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఆపద వస్తే ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు వదిలేస్తుంటారు. ఇది అలాంటి గిరిజన ప్రాంతం కాదు, నాగరిక సమాజానికి నడిమధ్యలోనే ఉంది. కానీ ఇక్కడ వాగుపై చిన్న బ్రిడ్జ్ నిర్మించడానికి ప్రభుత్వాలకు ఏళ్లకు ఏళ్లు టైమ్ పడుతోంది. అందుకే ప్రజలు ముందుకు కదిలారు. శ్రమదానం చేశారు, బ్రిడ్జ్ నిర్మించుకుంటున్నారు.
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ప్రజలు తమ ప్రాంతంలోని టౌన్ (త్రిపురాంతకం)కి వెళ్లాలంటే 15 కిలోమీటర్ల దూరం. వాగు దాటితే కేవలం 15 కిలోమీటర్ల దూరంలో త్రిపురాంతకం ఉంటుంది. కానీ వాగు వల్ల వారు 45 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ముష్ట్ల గంగవరం మీదుగా గుండ్లకమ్మ వాగు దాటి ముడివేముల మీదుగా త్రిపురాంతకం వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా వారికి మాత్రం చిన్న బ్రిడ్జ్ కట్టించలేకపోయారు నాయకులు. దీంతో గుండ్లకమ్మ వాగులో నీరు లేకపోతే కాలి నడకన దాటుతుండారు. నీరు ఉంటే చిన్న బల్లకట్టు ఆధారంగా వాగు దాటుతుండారు. ఇది ప్రాణంతో చెలగాటం అని తెలిసినా తప్పని పరిస్థితి.
ప్రభుత్వాలు మారినా ఫలితం లేకపోవడంతో చివరకు ప్రజలే ముందుకు కదిలారు. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధుల తీరుతో విసిగి వేసారిన ప్రజలు తామే గుండ్లకమ్మ వాగుపై చిన్న బ్రిడ్జ్ కట్టుకోవాలని నిర్ణయించారు. కురిచేడు మండలంలోని ముష్ట్లగంగవరం, నాంచారపురం, ప్రతిజ్ఞాపురం కాలనీ, రామాంజనేయ కాలనీ, ఆవులమంద, కురిచేడు.. త్రిపురాంతకం మండలంలోని ముడివేముల, కొత్త ముడివేముల, అన్నసముద్రం, త్రిపురాంతకం, మేడపి, పాపన్నపాలెం గ్రామాల ప్రజలు దీనికోసం ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకున్నారు. చివరికి వారంతా తమకు తామే వారధి నిర్మించుకోడానికి సిద్ధపడ్డారు.
20లక్షల ఎస్టిమేషన్..
వారధికోసం 20లక్షల రూపాయల ఎస్టిమేషన్ వేశారు. పార్టీలకతీతంగా కదిలి ఆ నిధులు పోగుచేసుకున్నారు. వారం రోజులుగా ప్రజలే ముందుకువచ్చి శ్రమదానం చేస్తున్నారు. నిర్మాణం కింది భాగం కోతకు గురికాకుండా కాంక్రీటుతో పనులు చేపట్టారు. వాగు ప్రవాహం వెళ్లేందుకు పెద్ద పెద్ద సిమెంటు పైప్ లను అమర్చనున్నారు. మరో ఇరవై రోజుల్లో పనులు పూర్తవుతాయని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ వారధి పూర్తయితే చుట్టు తిరిగి వెళ్లాల్సిన శ్రమ తగ్గుతుందని అంటున్నారు.