నాసిరకం బొగ్గుతో పవర్ ప్రాజెక్ట్ ప్రాణం తీశారు:సోమిరెడ్డి
పాలించండి అని ప్రజలు అధికారం ఇస్తే ప్రతిష్టాత్మక ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేటు పరం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
పాలించండి అని ప్రజలు అధికారం ఇస్తే ప్రతిష్టాత్మక ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేటుపరం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టును నడపడం చేతకాదని సీఎం జగన్ ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. లాభాలతో నడిపేందుకు ఉద్యోగులే సిద్ధంగా ఉన్నారని, వారికే బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. నష్టాలను సాకుగా చూపి పవర్ ప్రాజెక్ట్ ని, అదానీకి అప్పగించే కుట్రలో భాగంగానే విజయసాయి రెడ్డి కంపెనీలతో 9 లక్షల టన్నుల నాసిరకమైన బొగ్గు సరఫరా చేశారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కంపెనీకి నష్టాలు తెచ్చారని అన్నారు సోమిరెడ్డి.
ప్రైవేటుకు అప్పగించే టెండర్ ప్రక్రియను ఉపసంహరించుకోవడంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి. వేలాది మంది త్యాగంతో వచ్చిన ప్రాజెక్టు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళుతుంటే స్థానిక మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి పట్టనట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టును అదానీ గ్రూపుకి అప్పగించడానికి ఈనెల 22వ తేదీన టెండర్లు పిలుస్తున్నారని, ఆన్ లైన్ లో ఎవరు టెండర్ దాఖలు చేసినా ఒక్క అదానీ కంపెనీయే క్వాలిఫై అవుతుందనేది నగ్నసత్యం అని చెప్పారు మాజీ మంత్రి సోమిరెడ్డి. జగనన్న రాజ్యంలో ఆయన్ని కాదని ఎవరూ ధైర్యం చేసే టెండర్ వేసే ప్రసక్తే లేదని చెప్పారు. అదానీతో జగనన్నకు ఇప్పటికే ఒప్పందం జరిగిపోయిందని సెటైర్లు వేశారు.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రైవేటు చేతుల్లోకి వెళుతుంటే సర్వేపల్లి ఫ్రజల ఓట్లతో గెలిచి మంత్రి అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి పట్టకపోవడం దురదృష్టకరం అని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. వేల మంది నిర్వాసితుల త్యాగం గురించి ఒక్క క్షణం ఆలోచించే తీరికకూడా ఆయనకు లేకుండా పోయిందన్నారు. 22న టెండర్లు పిలవడాన్ని జెన్ కో పరిరక్షణ కమిటీ, ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. 300 రోజులకు పైగా ఉద్యోగులు, కార్మికులు నిరంతర పోరాటం సాగిస్తుంటే జగనన్న మాత్రం అదానీకే అంకితం చేస్తానంటున్నాడని మండిపడ్డారు. నేలటూరు ప్లాంటును అదానీ పరం చేసే టెండర్ల ప్రైవేటు ప్రక్రియను ఉపసంహరించుకోవాలన్నారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇక్కడ జెన్ కో ను ప్రైవేటు పరం చేయడం అన్యాయం అని అన్నారు సోమిరెడ్డి.
350 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఏడేళ్లుగా రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికి మాట నిలబెట్టుకోలేదని, మళ్లీ ఇప్పుడు 150 ఉద్యోగాలు ఇస్తామని జగన్ అంటున్నారని, అంటే.. ఉండే వాళ్లని రెగ్యులర్ చేస్తారా లేక కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తారో క్లారిటీ లేదని చెప్పారు సోమిరెడ్డి. ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన వారిని పక్కనపెట్టి 39 మంది పులివెందుల వాళ్లకి జీఓ 163 ప్రకారం రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులివ్వడం దారుణం అని అన్నారు.
సీఎం జగన్ తీరుతో ఆర్టీపీపీ, వీటీపీఎస్, జెన్ కో ఉద్యోగులందరూ తిరగబడే పరిస్థితి నెలకొందని అన్నారు. రెగ్యులర్ అయిన 39 మంది పులివెందుల వాసులు త్యాగమూర్తులా అన ప్రశ్నించారు. మిగతా వారందర్నీ నిర్లక్ష్యం చేసి వారినెలా రెగ్యులర్ చేస్తారన్నారు. పులివెందుల వారితో పాటు 1100 మందిని రెగ్యులర్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు సోమిరెడ్డి. ఓడరేవుతో పాటు అన్ని వసతులు కలిసిన దేశంలోని సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ ను నిర్వహించడం చేతకాదని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే తాము ఆదాయం తెచ్చి చూపిస్తామన్నారు.