Nellore News: దొంగెలెత్తుకెళ్లిన డబ్బు చెత్తబండిలో ప్రత్యక్షం - నిజాయితీగా సంపాదిస్తే ఎలాగైనా తిరిగి వచ్చేస్తాయా?
Viral News: నెల్లూరులో దొంగలెత్తుకుపోయిన సొమ్ము చెత్త బుట్టలో దొరికింది. పోయినవి అనుకున్న సొమ్ము దొరకడంతో ఆ వ్యక్తి సంతోషపడ్డాడు.

Stolen money found in a trash can in Nellore: మన ప్రేమ నిజం అయితే మనల్ని ఎవరూ విడదీయలేరు అంటాడు ఓ సినిమాలో హీరో. హీరోయిన్ నిజమేననుకుని వెళ్తుంది. చివరికి ఆ ఇద్దరూ కలుసుకుంటారు. అది సినిమా. నిజంగా అయితే.. నిజాయితీగా కష్టపడిన సంపాదించిన సొమ్ము అయితే ఏ దొంగా కొట్టేయలేడు. ఈ విషయం నెల్లూరులో నిరూపితమయింది. ..
బ్యాంకులో నగలు పెట్టి అప్పు తెచ్చుకున్న రైతు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లికి చెందిన రామకృష్ణ అనే రైతు ఇటీవల వ్యవసాయం కోసం డబ్బులు అవసరం అయితే బ్యాంకుకు వెళ్లాడు. తన బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంకులో రూ. 86 వేలు లోన్ తీసుకున్నాడు. ఈ డబ్బును బైక్ ముందు కవర్‌లో పెట్టుకున్నాడు. మధ్యలో ఓ హోటల్ వద్ద భోజనం కోసం ఆగాడు. తన బైక్ కవర్ లో డబ్బులు ఉన్నాయని ఎవరికీ తెలియదులే అనుకుని .. ఆకలి తీర్చుకోవడానికి వెళ్లాడు.
దృష్టి మళ్లించి కొట్టేసిన దొంగ
అయితే బ్యాంకులో డబ్బులు డ్రా చేయడం చూసిన ఓ వ్యక్తి ఓ వ్యక్తి అతడిని అనుసరించి వాహనంలో ఉన్న డబ్బును దొంగిలించాడు. తన బైక్ నుంచి డబ్బులు దొంగతనం చేయడం గుర్తించిన పట్టుకునేందుకు ప్రయత్నించినా ప్రయోజం లేకపోయింది. రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడు శ్రీనివాసపురం వీధిలోకి వెళ్లినట్లు గుర్తించారు. ముందు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత నిందితుడు అతను కాదని నిర్ధారించుకుని వదిలేశారు.
చెత్తబండిలో కనిపించిన అదే డబ్బు
శుక్రవారం ఉదయం శ్రీనివాసపురం ప్రాంతంలో పంచాయతీ చెత్త సేకరణ బండి వెళ్లింది. చెత్త పోస్తున్న రాయదుర్గం సురేష్ అనే వ్యక్తి పాలిథిన్ కవర్‌లో కరెన్సీ నోట్ల కట్టలు ఉండటం గుర్తించాడు. తీసుకుని ఓపెన్ చేసి చూడగా.. రూ. 86 వేల నగదు, బ్యాంక్ పాస్‌బుక్, పాన్‌కార్డు ఉన్నాయి. సురేష్ వెంటనే ఆ నగదును, పాస్‌బుక్, పాన్‌కార్డును స్థానిక ఎస్సై హనీఫ్‌కు అప్పగించాడు. ఎస్సై హనీఫ్ సురేష్ నిజాయితీని ప్రశంసించి రూ. 1000 బహుమతి ఇచ్చారు.
తన డబ్బు తనకు చేరడంతో రైతు ఆనందం
పాస్‌బుక్ ఆధారంగా డబ్బు రామకృష్ణదేనని నిర్ధారించి అతనికి అప్పగించారు. సురేష్ మంచి మనసు, నిజాయితీని అందరూ ప్రశంసిస్తున్నారు. చోరీకి గురైన నగదు తిరిగి తనకు చేరడంతో ఆ రైతు ఊపిరి పిల్చుకున్నాడు. ఆ రైతు తన బంగారన్ని తాకట్టు పెట్టుకున్న సొమ్ము తిరిగి వచ్చింది. దొంగ.. పోలీసులు వస్తున్నారని భయపడిపోయి .. ఎప్పుడైనా పట్టుకుంటారన్న భయంతో చెత్తకుండాలో విసిరేసినట్లుగా అనుమానిస్తున్నారు. అలా విసిరేసినా.. అసలు సొమ్ము.. అసలు వ్యక్తికే చేరడంతో అంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.





















