SSLV D2 Launch Today: మరికాసేపట్లో SSLV రాకెట్ ప్రయోగం, అంతరిక్షంలోకి 3 ఉపగ్రహాలు
కౌంట్‌డౌన్ ప్రక్రియ ఈ రోజు (శుక్రవారం) వేకువజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటలపాటు కొనసాగాక.. ఉదయం సరిగ్గా 9.18 గంటలకు మొదటి ప్రయోగవేదిక నుంచి SSLV D2 నింగిలోకి దూసుకెళ్తుంది.
తొలి ప్రయత్నం SSLV D1 విఫలమైంది, ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఇస్రో SSLV D2 ని నింగిలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది సేపట్లో ఈ బుల్లి రాకెట్ అంతరిక్షంలోకి వెళ్తుంది. మూడు ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశ పెట్టడానికి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) ని ప్రత్యేకంగా రూపొందించారు.
చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ SSLV. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ తరహాలోనే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే పేరుతో SSLV ప్రయోగాలు మొదలు పెట్టింది. గతేడాది ఆగస్ట్ లో మొదటి ప్రయోగం చేపట్టింది. ఆగష్టు నెల 7వ తేదీన ప్రయోగించిన SSLV-D1 సాంకేతిక కారణాలవల్ల విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశ పడ్డారు. అయితే ఆ తర్వాత ఆ ప్రయోగం విఫలమవడానికి గల కారణాలు తెలుసుకొని తప్పులు సరిదిద్దుకొని ఈ సారి ప్రతిష్టాత్మకంగా రెండో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ ప్రయోగం విజయవంతమయితే ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్ లో భారత్ దూసుకుపోతుంది. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశాలుకు సంబందిచిన చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సాధిస్తుంది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక SSLV D2ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ షార్ లోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. గురువారం రిహార్సల్స్ నిర్వహించి, రాకెట్ పనితీరు బాగున్నట్లు నిర్ధారించారు. షార్ లోని బ్రహ్మ ప్రకాష్ హాలులో డాక్టర్ సోమనాథ్ రాకెట్ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత భాస్కర కాన్ఫరెన్స్ హాల్ లో లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్) సమావేశం కూడా పూర్తయింది. ఈ రెండు సమావేశాల్లో అంతా పక్కాగా ఉన్నట్టు నిర్థారించుకుని రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా చాలా తక్కువ సమయమే ఉంది. కౌంట్‌డౌన్ ప్రక్రియ ఈ రోజు (శుక్రవారం) వేకువజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటలపాటు కొనసాగాక.. ఉదయం సరిగ్గా 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక SSLV D2 నింగిలోకి దూసుకెళ్తుంది.
ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల EOS -07 ఉపగ్రహంతో పాటు అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు 750మంది కలసి రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూ సమీప కక్ష్యల్లో ఈ రాకెట్ ప్రవేశ పెడుతుంది.
రాకెట్ ప్రయోగం మొత్తం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. భూ ఉపరితలానికి 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో మొదటగా EOS -07ను రాకెట్ కక్ష్యలో ప్రవేశ పెడుతుంది. ఆ తర్వాత 880 సెకన్లకు జానుస్-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీశాట్ ను కక్ష్యలో ప్రవేశపెడుతుంది.
ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో డైరెక్టర్ డాక్టర్ సోమనాథ్.. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ, స్థానిక చెంగాలమ్మ దేవస్థానంలోనూ రాకెట్ నమూనాలకు పూజలు చేయించారు. తొలి ప్రయోగం విఫలం కావడంతో, రెండో ప్రయోగం విషయంలో శాస్త్రవేత్తలు అత్యంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు. రెండో ప్రయోగం సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.