Nellore Rural Politics: నెల్లూరు రూరల్‌లో జగన్ ని చూసి ఓట్లు వేశారా, కోటంరెడ్డికి సొంత బలమా!
MLA Kotamreddy Sridhar Reddy: ఇప్పటినుంచే కోటంరెడ్డి ఓ ప్లాన్ ప్రకారం రూరల్ లో ప్రతి గడప టచ్ చేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. తన తోపాటు తన కుటుంబ సభ్యులను కూడా ప్రచారంలో దింపారు.
Nellore Rural MLA Kotamreddy: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈసారి విజయం అత్యంత కీలకంగా మారింది. వైసీపీని వదిలి, జగన్ ని ఎదిరించి ఆయన బయటకొచ్చారు, టీడీపీలో చేరి సైకిల్ గుర్తుపై పోటీ చేయబోతున్నారు. ఇన్నాళ్లూ జగన్ ని చూసి కోటంరెడ్డికి ఓట్లు వేశారా, లేక కోటంరెడ్డి సొంత బలం, బలగం జగన్ కి అండగా నిలబడిందా అనే విషయం ఈ ఎన్నికలతో తేలిపోతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి.. ఈసారి హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీలో ఉంటే ఆయన విజయం నల్లేరుపై నడక అని చెప్పుకోవాలి, కానీ ఈసారి ఆయన టీడీపీ టికెట్ పై పోటీ చేస్తుండటంతో మొగ్గు ఎటువైపో ఊహించలేని పరిస్థితి.
చెమటోడుస్తున్న కోటంరెడ్డి..
అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా కోటంరెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉంటారనే ఇమేజ్ ఉంది. దానికి అనుగుణంగానే ఆయన పార్టీ మారినా కూడా ప్రజలతోనే ఉంటున్నారు. ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సారి అన్నదమ్ములిద్దరూ రూరల్ లో టీడీపీ జెండా ఎగరేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కోటంరెడ్డి బ్రదర్స్ కి కుటుంబం కూడా తోడయింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి, వారి కుమార్తెలిద్దరూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం, కొత్తవెల్లంటి గ్రామంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భార్య కోటంరెడ్డి సుజిత, కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్ధించారు.
ఒక్కడినే ఒంటరిగా..
గతంలో వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముందే కోటంరెడ్డి తన నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లేవారు. ఆయన ప్రజా బాట అప్పట్లో బాగా ఫేమస్. ఆ కార్యక్రమం చూసే.. సీఎం జగన్ గడప గడపకు అనే కార్యక్రమాన్ని రూపొందించారని అంటారు. టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా కోటంరెడ్డి ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. గత నెల 25న ఆయన.. ఒక్కడినే ఒంటరిగా అనే కార్యక్రమం చేపట్టారు. 33 రోజులపాటు లక్ష మందితో ఒంటరిగా తాను సమావేశం అవుతానని, ప్రతి ఒక్కరినీ పలకరిస్తానని, వారి కష్టసుఖాలు తెలుసుకుంటానని చెప్పారు కోటంరెడ్డి. తుఫాన్ వల్ల కాస్త గ్యాప్ వచ్చినా.. ఇప్పుడు తిరిగి ఆ కార్యక్రమం మొదలు పెట్టారు. ఆయనతో కాకుండా విడిగా కుటుంబ సభ్యులు కూడా ఇంటింకటికీ వెళ్తున్నారు. టీడీపీ కరపత్రాలను పంచుతూ శ్రీధర్ రెడ్డికి అండగా నిలవాలని ప్రజల్ని కోరుతున్నారు.
ఆదాల ప్రత్యర్థి అయితే..
నెల్లూరు రూరల్ లో ఈసారి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తారని అంటున్నారు. ఆయన్ను సీఎం జగన్ ఇన్ చార్జ్ గా కూడా నియమించారు. ఆదాల కూడా రూరల్ లో పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన ఆర్థికంగా బలమైన నేత కావడంతో కోటంరెడ్డి గెలుపు ఈసారి అంత ఈజీకాదేమోనని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రం రూరల్ లో కోటంరెడ్డి గెలుపు సునాయాసంగా మారుతుంది. ఆదాల ప్రత్యర్థి అని ముందుగానే తేలిపోవడంతో కోటంరెడ్డి కూడా ఈ ఎన్నికలను అంత ఈజీగా తీసుకునేలా లేరు. ఇప్పటినుంచే ఆయన ఓ ప్లాన్ ప్రకారం రూరల్ లో ప్రతి గడప టచ్ చేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. తన తోపాటు తన కుటుంబ సభ్యులను కూడా ప్రచారంలో దింపారు.