Nellore Police: నెల్లూరు జిల్లాలో పాత నేరస్థుల కదలికలపై నిఘా, పోలీసుల సమీక్షా సమావేశంలో నిర్ణయం
Nellore News: నెల్లూరు జిల్లాలో నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు ఎస్పీ విజయరావు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా, పోలీస్ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని చెప్పారు.
నెల్లూరు జిల్లాలో నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు ఎస్పీ విజయరావు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా, పోలీస్ సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని చెప్పారు. జిల్లా నేర సమీక్ష సమావేశం నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని స్టేషన్ల వారీగా కేసులపై సమీక్ష నిర్వహించారు. దొంగతనాల కట్టడితో పాటు చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు ఎస్పీ విజయరావు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. పాత నేరస్థుల వల్ల నేరాల సంఖ్య పెరిగే అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
అసాంఘిక కార్యక్రమాలు, మాదక ద్రవ్యాల విక్రయాలు, గుట్కా, అక్రమ మద్యం రవాణాపై సెబ్ అధికారులతో జిల్లా పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహించాలన్నారు ఎస్పీ విజయరావు. సైబర్ నేరాలు, దిశ యాప్ వినియోగం, మహిళల చట్టాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. జాతీయ రహదారులపై హైస్పీడ్ వెహికల్స్ పై దృష్టిపెట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ లను నిరోధించాలని చెప్పారు. చాయ్ విత్ బీట్స్ కార్యక్రమాన్ని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించాలన్నారు.
సమీక్ష సమావేశానికి ముందుగా జిల్లా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నివాళులర్పించారు పోలీసులు. ఆయన మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు.
ఉత్తమ పనితీరు కనబరిచినవారికి అభినందన..
నెలవారీ నేర సమీక్ష నిర్వహించడంతోపాటు గత నెలలో సమర్థంగా విధులు నిర్వహించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ విజయరావు అభినందనలు తెలిపారు. గత నెలలో పెండింగ్ ఉన్న కేసులు తగ్గించడం, బందోబస్తు విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 54 మందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి స్పెషల్ కేటగిరి కింద ఎస్పీ చేతులమీదుగా అవార్డు దక్కించుకున్నారు. ఈ సమీక్షలో జిల్లా ఏఎస్పీలు వెంకట రత్నం, శ్రీనివాసరావు.. సిబ్బంది పాల్గొన్నారు.
ఫైరింగ్ రేంజ్ లో ఎస్పీ..
నేర సమీక్ష సమావేశంలో భాగంగా పోలీసు ఫైరింగ్ రేంజిలో ఎస్పీ విజయరావు ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ లో హోంగార్డు ఆర్‌ఐ లక్ష్మీనారాయణ, పోలీసు కంట్రోల్ రూం ఎస్సై జగన్ మోహన్ రావు మొదటి స్థానం సాధించారు. నెల్లూరు నగరానికి చెందిన సంతపేట ఇన్ స్పెక్టర్ అన్వర్ బాషా ఫైరింగ్ లో ద్వితీయ స్థానం సాధించగా.. ఉదయగిరి స్పెషల్ బ్రాంచ్ సీఐలు గిరిబాబు, అక్కేశ్వరరావు తృతీయ స్థానాలు సాధించారు.
పోలీస్ బందోబస్తుపై అభినందన..
ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆయన అంతిమయాత్ర, అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. డీఐజీ త్రివిక్రమరావు కూడా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంతోపాటు, నెల్లూరు నుంచి ఉదయగిరి వెళ్లే క్రమంలో పోలీసుల బందోబస్తు సమర్థంగా నిర్వహించారు.