(Source: ECI/ABP News/ABP Majha)
Nellore Speed Breakers: నెల్లూరులో ప్రాణాలు తీస్తున్న స్పీడ్ బ్రేకర్లు.. హైవేలపై ఇదెక్కడి విడ్డూరం..
Plastic Drums Speed Breakers: నెల్లూరు జిల్లాలో ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఇసుక నింపు స్పీడ్ బ్రేకర్లుగా వాడుతున్నారు పోలీసులు. ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తోంది.
Plastic Drums Used As Speedbreakers: జాతీయ రహదారులపై వాహనాలు యమా స్పీడ్ తో వెళ్తుంటాయి. రహదారులపై గ్రామాలు సమీపిస్తున్నప్పుడు, మలుపుల్లో వేగాన్ని నియంత్రించుకోవాలని హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు. అయితే హైవేపై స్పీడ్ బ్రేకర్లు పెట్టడం మాత్రం దాదాపు అసాధ్యం. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఇసుక నింపు స్పీడ్ బ్రేకర్లుగా వాడుతున్నారు పోలీసులు. ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తోంది.
నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దాటిన తర్వాత దువ్వూరు వద్ద గతంలో ఓ ప్రమాదం జరిగింది. స్థానికులు రోడ్డుపక్కన వేచి చూస్తుండగా.. ఓ వ్యాన్ ఢీకొని కొంతమంది అక్కడికక్కడే చనిపోయారు. అప్పటినుంచి స్థానికులు పోలీసుల సహకారంతో అక్కడే ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఇసుక పెట్టి వాహనాలు వేగం తగ్గేలా చేస్తున్నారు.
తాజాగా మర్రిపాడు వద్ద కూడా ఇలా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఇసుక నింపి రోడ్డుకి అడ్డుగా పెడుతున్నారు. సహజంగా ఫారెస్ట్ చెక్ పోస్ట్ ల వద్ద బ్యారికేడ్లు పెట్టి వాహనాల వేగాన్ని నియంత్రిస్తారు. తనిఖీలకు ఇది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిని ఎంచుకుంటారు. కానీ ఇలా అకస్మాత్తుగా రోడ్డుకి అడ్డుగా ప్లాస్టిక్ డ్రమ్ములు పెడుతుండటంతో వాహనదారులకు దానిపై అవగాహన లేక వేగంగా వచ్చి వాటినే ఢీకొంటున్నారు. ఇలా ప్రమాదాల నియంత్రణకోసం చేసిన చర్యల వల్ల కొత్త ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాజాగా మర్రిపాడు మండలం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై అచ్చమాంబ గుడి రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఇసుక డ్రమ్ములను ఢీ కొట్టిన ఓ పోలీస్ ఆధికారి కారు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ప్రమాదానికి గురైన కారు రెండు చక్రాలు గుర్తుతెలియని దొంగలు తీసుకెళ్లారు. దీంతో ఇది మరో సంచలనంగా మారింది. తరచూ ఏదో ఒక వాహనం ఇసుక డ్రమ్ములను ఢీకొనడంతో ఇక్కడ ఇసుక రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోతోంది. మరికొన్ని సందర్భాల్లో వేగాన్ని నియంత్రించుకోలేక వాహనాలు స్పీడ్ గా వచ్చి బోల్తా పడిపోతున్నాయి.
హైవేపై ప్రమాదాల నివారణకు శాస్త్రీయంగా సర్వే చేపట్టి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అంతే కాని ఇలా హైవేకి అడ్డుగా ఇసుక డ్రమ్ములు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటున్నారు స్థానికులు. కానీ పోలీసులు మాత్రం వాహనాల వేగాన్ని నియంత్రించడానికి ఇంతకంటే మరో ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు.
మొత్తమ్మీద వాహనాల వేగాన్ని నియంత్రించడానికి చేసిన ఈ ఏర్పాటు వల్ల అసలుకే మోసం వస్తోంది. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా.. ఇలాంటి ఇసుక డ్రమ్ముల వల్ల ప్రమాదాలు మరింత పెరిగాయి. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు స్థానికులు.
Also Read: Amalapuram: మంత్రికి, ఎంపీకి చేదు అనుభవం.. అందరి ముందు ముఖంపైనే ఆ మాట అనడంతో వేదికపైనే..