Nellore: పూజలు చేసి సొమ్మంతా దోపిడీ - నెల్లూరులో సినిమా స్టైల్లో మోసం!
Nellore Crime News: ఇంటికి వచ్చిన పూజారులు దంపతులిద్దరితో పూజలు చేయించారు. హోమం కూడా పూర్తి చేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగదుని ఆ పూజా స్థానంలో పెట్టాలని సూచించారు.
Nellore Cheating News: ఇంద్ర సినిమాలో మీది తెనాలే, మాది తెనాలే అంటూ బంగారు నగలు రెట్టింపు చేస్తామని మోసం చేసే సీన్ ఒకటి ఉంటుంది. పూజ చేసి బంగారు నగలతో ఉడాయిస్తారు మోసగాళ్లు. సరిగ్గా అలాంటి సీన్ నెల్లూరు జిల్లాలో జరిగింది. అయితే ఇక్కడ బంగారు నగలను పూజలో పెట్టలేదు. 9లక్షల రూపాయల నగదుని పూజారులకు అప్పగించారు బాధితులు. వారు ఆ డబ్బుతో ఉడాయించారు. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు.
పూజల పేరుతో నగదు దోచుకున్న ఘటన నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ లో జరిగింది. స్థానిక సరస్వతి నగర్ లోని ఆర్ఆర్ టవర్స్ లో శ్రీనివాసులరెడ్డి, రాజమ్మ దంపతులు నివశిస్తున్నారు. శ్రీనివాసులరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు పక్షవాతం కూడా ఉంది. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించింది. ఆయన్ను ఆస్పత్రులకు తిప్పుతున్నా ఫలితం లేదు. అయితే ఇదే అదనుగా సుబ్బారావు అనే కేటుగాడు ఆ కుటుంబాన్ని మోసం చేశాడు. వారికి మాయమాటలు చెప్పి ఆస్పత్రి ఖర్చులకోసం దాచుకున్న 9లక్షల రూపాయలతో ఉడాయించాడు.
పక్కా ప్లాన్ తో..
శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి కొన్నాళ్లుగా సుబ్బారావు తెలుసు. ఆ పరిచయంతోనే వారి ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు. శ్రీనివాసులరెడ్డి అనారోగ్యం గురించి, ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి కూడా సుబ్బారావుకి తెలియడంతో అతడు పక్కా ప్లాన్ తో వారి వద్ద ఉన్న నగదు కాజేశాడు. దీనికోసం వారికి ఉన్న దైవభక్తిని వాడుకున్నాడు. శ్రీనివాసులరెడ్డి అనారోగ్యం తర్వాత వారు ఆస్పత్రులతోపాటు, ఆలయాలకు కూడా తిరుగుతున్నారు. ఆరోగ్యం బాగుపడేందుకు పూజలు చేయిస్తున్నారు. అయితే తనకు తెలిసిన పూజారులతో ఆరోగ్య హోమం చేయిస్తే ఫలితం ఉంటుందని సుబ్బారావు వారిని నమ్మించాడు. తనకు తెలిసిన ఇద్దరు పూజారులు ఉన్నారని, వారు ఇంటికి వచ్చి పూజలు చేసి, హోమం చేస్తే ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయని చెప్పి నమ్మించాడు. దీంతో వారు సుబ్బారావు మాటలు నమ్మి ఆ పూజారులను ఇంటికి పిలిపించారు.
ఇంటికి వచ్చిన పూజారులు దంపతులిద్దరితో పూజలు చేయించారు. హోమం కూడా పూర్తి చేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగదుని ఆ పూజా స్థానంలో పెట్టాలని సూచించారు. అలా చేస్తేనే ఆరోగ్యం బాగవుతుందని నమ్మించారు. పూజలు పూర్తయ్యాక ఇంట్లోని నగదుని వారు చెప్పిన చోట పెట్టారు శ్రీనివాసులరెడ్డి దంపతులు. ఆస్పత్రి ఖర్చులకోసం ఉంచుకున్న 9లక్షల రూపాయల నగదుని ఓ బ్యాగ్ లో పెట్టి వారు చెప్పినచోట పెట్టారు. ఆ తర్వాత దంపతులిద్దర్నీ కొద్దిసేపు వంట గదిలో ఉండాలని సూచించారు పూజారులు. వారిని అటు పంపించి, వీరు ఇటు ఉడాయించారు. కాసేపటికి వంట గదినుంచి వచ్చి చూసిన బాధితులు తాము మోసపోయామని గ్రహించారు. సుబ్బారావుకోసం గాలించినా ఫలితం లేదు. దీంతో ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూజల పేరుతో డబ్బులు తీసుకోవడం చాలా చోట్ల చూస్తున్నాం. అయితే పూజలు అయిపోయిన తర్వాత ఇంట్లోని నగదుని పూజలో పెట్టాలని చెప్పి ఆ మొత్తం డబ్బుతో ఉడాయించారు కేటుగాళ్లు. ఇలాంటి ఉదాహరణలు గతంలో జరిగినా కూడా ఆరోగ్య సమస్యలు కావడంతో శ్రీనివాసులరెడ్డి దంపతులు చివరి ప్రయత్నం చేశారు. చివరకు తెలిసినవారి చేతిలోనే మోసపోయారు. ఆస్పత్రి ఖర్చులకోసం దాచుకున్న 9 లక్షల రూపాయలు పోయాయని వారు లబోదిబోమంటున్నారు.