Nellore: తినేందుకు తిండి లేదు గానీ ఇదేం సరదానో! పీవీ, వైఎస్ఆర్‌లతోనే ఢీ - ఇప్పుడు మళ్లీ అలాంటి పనే
పుష్ప మూవీ హుక్ డైలాగ్.. తగ్గేదే లే.. అనేది ఆ పెద్దాయనకు కరెక్ట్ గా సరిపోతుంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఎక్కడా పోటీకి తగ్గేదే లేదంటారాయన.
పుష్ప మూవీ హుక్ డైలాగ్.. తగ్గేదే లే.. అనేది ఆ పెద్దాయనకు కరెక్ట్ గా సరిపోతుంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఎక్కడా పోటీకి తగ్గేదే లేదంటారాయన. పీవీ నరసింహారావు నుంచి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు ఎవరితో అయినా పోటీకి తగ్గేదే లేదని కూడా నిరూపించుకున్నారు. ఇప్పటి వరకూ 20 సార్లు పంచాయతీ ఎన్నికలనుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు నామినేషన్లు వేసి హల్ చల్ చేసిన రావులకొల్లు కొండయ్య అలియాస్ కుమ్మరి కొండయ్య అలియాస్ ఎలక్షన్ల కొండయ్య.. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 21వ సారి నామినేష్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నాకూడా నామినేషన్ కోసం డబ్బులు సిద్ధం చేసుకొని అక్కడికి వెళ్లి నామినేషన్ వేయడం రావులకొల్లు కొండయ్యకు అలవాటు. ప్రత్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన, ప్రధాని అభ్యర్థి అయినా సరే కొండయ్య నామినేషన్ పడాల్సిందే. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంటు ఎన్నికలు దాకా 20 సార్లు పోటీకి నామినేషన్ దాఖలు చేసిన ఘనుడు ఈ కొండయ్య.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఈయన స్వగ్రామం. వృత్తి కుండలు తయారు చేయడం, ప్రవృత్తి ఎన్నికలకు నామినేషన్లు వేయడం. కడపలో ఎంపీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేసినప్పుడు ప్రత్యర్థులలో కొండయ్య కూడా ఒకరు. నంద్యాలలో ప్రధాని పీవీ నరసింహారావుపై కూడా బరిలో దిగి అందర్నీ ఆశ్చర్యపరిచారు కొండయ్య.
ఎలా మొదలైంది..?
1987లో ఆత్మకూరులో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి తన ప్రయాణం మొదలు పెట్టారు కొండయ్య. ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో మొత్తం 20 సార్లు నామినేష్లు వేశారు. ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తితో నామినేష్ల సొమ్ముకోసం కొండయ్య ఆస్తులు కూడా అమ్ముకున్నారట. పేదల సమస్యలు తీర్చేందుకు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతుంటారు కొండయ్య. రావులకొల్లు గ్రామానికి చెందిన కొండయ్య 40 ఏళ్లుగా ఆత్మకూరులో నివాసముంటున్నారు.
ఇంకా పేదరికంలోనే..
ఎంతో కొంత పుచ్చుకుని నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశ వాదుల్ని మనం చూసే ఉంటాం. కానీ కొండయ్య ఎవరు ఎంత బతిమిలాడినా, ప్రలోభ పెట్టినా నామినేష్ మాత్రం ఉపసంహరించుకునేవారు కాదు. అందుకే ఆయన ఇంకా నిరుపేదగానే మిగిలిపోయారు. పూరి గుడిసెలోనే కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గతంలో తాను నామినేషన్లు వేసిన సందర్భంగా వచ్చిన పేపర్ కటింగ్స్ ని ఇంకా భద్రంగా ఉంచుకున్నారు కొండయ్య. తన గురించి ఎవరైనా అడిగితే అవి తీసి చూపిస్తుంటారు. ఆరెకరాల పొలం, జట్కాబండి కూడా ఎన్నికల నామినేషన్ల కోసం అమ్ముకున్నానని చెబుతారాయన.
వింతలు విశేషాలు..
గతంలో నంద్యాలలో పీవీ నరసింహారావుపై పోటీకి సిద్ధమైన కొండయ్య అక్కడకు నామినేషన్ వేసేందుకు వెళ్లగా.. మూడు రోజులపాటు ఎవరో కిడ్నాప్ చేశారట. ఒకసారి ఆత్మకూరులో భిక్షాటన చేసి నామినేషన్ డబ్బుల్ని సమకూర్చుకుని ఆ చిల్లర తీసుకెళ్లి అధికారులకు ఇచ్చారు. దాన్ని లెక్కబెట్టుకోవడంలో అధికారులు తలకిందులయ్యారు ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కొండయ్య నామినేషన్ ఎపిసోడ్ లో కనిపిస్తాయి. తన రాజకీయ వారసురాలిగా గతంలో ఓసారి తన కుమార్తెను కూడా ఎన్నికల బరిలో నిలిపార కొండయ్య. ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నికలలో కూడా తాను బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.