Nellore Collector: ఉత్తమ ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా కలెక్టర్
నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఉత్తమ ఎన్నికల అధికారిగా ఎంపికయ్యారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో పనితీరు కారణంగా ఆయన్ని ఉత్తమ ఎన్నికల అధికారిగా ఎంపిక చేశారు.
![Nellore Collector: ఉత్తమ ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ Nellore District Collector Bags Best Electoral Award Nellore Collector: ఉత్తమ ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా కలెక్టర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/24/b0dd0ebbc3312d59d732cd1d4e159047_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఉత్తమ ఎన్నికల అధికారిగా ఎంపికయ్యారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా పటిష్టంగా కొవిడ్ ప్రోటోకాల్ పాటించేలా చూసినందుకు, ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిపినందుకు ఆయన్ని ఉత్తమ ఎన్నికల అధికారిగా ఎంపిక చేశారు. బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్- 2021 కింద కేంద్ర ఎన్నికల సంఘం నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి కమ్ కలెక్టర్ అయిన చక్రధర్ బాబును ఎంపిక చేసింది. ఈ నెల 25న రాష్ట్ర స్థాయిలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన ఈ అవార్డును అందుకోబోతున్నారు. అయితే తిరుపతి ఉపఎన్నిక ప్రక్రియ విజయవంతం కావడంలో తనతోపాటు అధికార యంత్రాంగం కృషి ఎంతగానో ఉందని చెప్పిన కలెక్టర్ చక్రధర్ బాబు..ఈ అవార్డును వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
2020 జులైలో చక్రధర్ బాబు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా వచ్చారు. గతంలో నెల్లూరు కార్పొరేషన్ కు తొలి ఐఏఎస్ కమిషనర్ గా ఆయన పని చేశారు. అనంతరం బదిలీపై వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఆయన నెల్లూరు జిల్లాకు రావడానికి ప్రయత్నించారు. 2020 జులైలో ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.
పాలనలో తనదైన ముద్ర..
కరోనా వచ్చిన తొలినాళ్లలో చక్రధర్ బాబు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా వచ్చారు. జిల్లాలో కొవిడ్ పరిస్థితులను అదుపు చేయడంలో ఆయన సమర్థంగా పని చేశారు. స్థానిక ఎన్నికలు, తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల సమయంలో కూడా ఆయన పనితీరుకి ప్రశంసలు లభించాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గా అందరినీ సమన్వయం చేసుకుని పని చేశారు చక్రధర్ బాబు. సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చిన సందర్భంలో కూడా కలెక్టర్ పనితీరుని ప్రశంసించారు. వరద సాయం అందించడంలో, సహాయక చర్యల్లో ఆయన పనితీరు బాగుందని.. శభాష్ చక్రి అంటూ భుజం తట్టారు సీఎం జగన్.
వ్యాక్సినేషన్లో రికార్డులు..
ఏపీలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100శాతం పూర్తి చేసిన జిల్లాల్లో నెల్లూరు మొదటి స్థానంలో ఉంది. వ్యాక్సినేషన్ విషయంలో నెల్లూరు జిల్లాని తొలి స్థానంలో నిలిపిన ఘనత జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుదేనంటారు. ఆ తర్వాత టీనేజ్ వ్యాక్సినేషన్లో కూడా నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. టీకాల ప్రక్రియలో అందరినీ సమన్వయం చేసి, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ అందరికీ సకాలంలో టీకాలు అందేలా చేశారు కలెక్టర్.
తిక్కన భవన్..
నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో గతంలో సమీక్షలు జరగాలంటే సరైన వసతి ఉండేది కాదు. సమీక్షలకోసం జడ్పీ కార్యాలయాన్ని వాడుకునేవారు. కలెక్టర్ చక్రధర్ బాబు ప్రత్యేక చొరవతో తిక్కన భవన్ ఏర్పాటు చేయించారు. ఇక సమీక్షలన్నీ అక్కడే నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో గాంధీ మహాత్ముడి విగ్రహం కూడా ఆయన హయాంలో ఏర్పాటు చేయించారు. తన పాలనతో జిల్లాపై అరుదైన మార్కు వేసిన చక్రధర్ బాబు.. ఉత్తమ ఎన్నికల అధికారిగా ఎంపిక కావడంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)