Janasena Vs YSRCP: అటు జనసేన డిజిటల్ యుద్ధం - ఇటు అధికార వైసీపీ రోడ్ల ప్రారంభోత్సవాలు
Nellore News: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అల్లీపురం - నరుకూరు రోడ్డును మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రారంభించారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో 6 కిలోమీటర్ల మేర ఇక్కడ నూతనంగా రోడ్డు నిర్మించారు.
ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా గతుకుల రోడ్లపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. అదే సమయంలో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కూడా ఊపందుకుంది. జనసేన డిజిటల్ క్యాంపెయిన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సహజంగా రోడ్ల నిర్మాణం ప్రారంభమయ్యే సమయంలో శంకుస్థాపనలకు ప్రచారం చేసుకుంటారు. కానీ రోడ్డు పూర్తయిన తర్వాత అట్టహాసంగా దాన్ని మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. జనసేన చేస్తున్న ప్రచారం తప్పు అని నిరూపించేందుకే ఇలా ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేశారని అంటున్నారు. ో
రోడ్లు ప్రారంభిస్తున్న వైసీపీ నేతలు..
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అల్లీపురం - నరుకూరు రోడ్డును మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రారంభించారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో 6 కిలోమీటర్ల మేర ఇక్కడ నూతనంగా రోడ్డు నిర్మించారు. ఈ సందర్భంగా రోడ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, కానీ ఎక్కడికక్కడ నూతన రోడ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు కాకాణి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతర శ్రామికుడు, నిబద్దత కలిగిన వ్యక్తి అని, అలాంటి నాయకుడు నియోజకవర్గంలో ఉంటే ఏవిధంగా అభివృధి చెందుతుందో నెల్లూరు రూరల్ ని ఉదాహరణగా చూపించొచ్చని అన్నారు.
సీఎం జగన్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డి కృతజ్ఞతలు
అల్లీపురం - నరుకూరు రోడ్డు నిర్మాణానికి సహాయసహకారాలు అందించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో కాలనీ లోపల ఉన్న రోడ్లకు మరియు ఇతరిత్రా అభివృద్ధి పనులకు 100 కోట్ల రూపాయల నిధులు మంజూరుచేయించాలని మంత్రి కాకాణిని కోరారు. అల్లీపురం - నరుకూరు రోడ్డు నిర్మాణంకోసం శ్రమించిన రోడ్లు భవనాలశాఖ అధికారులకు, ప్రత్యేకంగా కాంట్రాక్టర్ కి కూడా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల నెల్లూరు రూరల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టారు. రోడ్ల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం అనే సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. గతంలో పూర్తి చేసిన పనుల బిల్లులే ఇంకా రాలేదని, చాలా చోట్ల కాంట్రాక్టర్లు వెనకడుగు వేశారు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యక్తిగతంగా భరోసా ఇచ్చారు. తన సొంత పూచీ కత్తుతో రోడ్ల నిర్మాణం మొదలు పెట్టాలని చెప్పారు. దీంతో కాంట్రాక్టర్లకు ధైర్యం వచ్చింది. ఎమ్మల్యే వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నారు కాబట్టి, కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. దీని ఫలితమే అల్లీపురం-నరూకురు రోడ్డు నిర్మాణం.
పది కోట్ల రూపాయల ఖర్చుతో 6 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించారు. గతంలో గుంతలు తేలి ప్రయాణికులకు నరకం చూపించే ఈ రోడ్డు ఇప్పుడు సుందరంగా తయారైంది. దీంతో రూరల్ ఎమ్మెల్యేని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జనసేన డిజిటల్ క్యాంపెయిన్ పేరుతో గుంతల రోడ్లను చూపిస్తూ హడావిడి చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి కొత్త రోడ్లతో వారికి కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారు వైసీపీ నేతలు. అందుకే రోడ్ల నిర్మాణాలను కూడా ప్రచారం చేసుకుంటున్నారు.
Also Read: TTD Updates: తిరుమలలో పోటెత్తుతున్న భక్తులు, దర్శనానికి పడుతున్న సమయం ఎంతంటే