Nellore Crime: అప్పుడు బెట్టింగ్, ఇప్పుడు డ్రగ్స్ - టాక్ ఆఫ్ ఏపీగా నెల్లూరు! అసలేం జరుగుతోంది
Nellore News: ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏపీ తమిళనాడుకు సరిహద్దుగా ఉంది. ఇక్కడి వరకు గంజాయి తీసుకొస్తే అటునుంచి అటే తమిళనాడు చేరవేయవచ్చు. కర్నాటక వెళ్లాలంటే వయా తిరుపతి రూటు ఉండనే ఉంది.
Nellore Crime News: నెల్లూరు జిల్లా ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. కుటీర పరిశ్రమగా ఇంట్లోనే డ్రగ్స్ తయారు చేస్తున్న ఓ బ్యాచ్ ని పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజే జిల్లా వైసీపీ నేత కొడుకు హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు పుకార్లు వచ్చాయి. అయితే సదరు నేత కొడుకుని కేవలం పోలీసులు విచారణకు పిలిపించి వదిలిపెట్టారని, మరికొందర్ని మాత్రం అరెస్ట్ చేశారని తెలిసింది. వరుస ఘటనలతో నెల్లూరు ఉలిక్కి పడుతోంది.
గతంలో బెట్టింగ్..
అప్పట్లో నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ కి అడ్డాగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు కూడా అప్పట్లో పోలీస్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ బంగార్రాజుల్ని కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు నెల్లూరులో ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతుందేమోననే అనుమానాలు నేటికీ ఉన్నాయి.
ఇతర రకాల నేరాలు పెద్దగా బయటపడేవి కావు కానీ.. నెల్లూరు జిల్లా ఎర్రచందనం స్మగ్లింగ్ కి కూడా కేరాఫ్ అడ్రస్ గానే నిలిచేది. నెల్లూరు సరిహద్దుల్లోని అడవులు, అక్కడి కొండకింద పల్లెల్లో ఎర్రచందనం డంప్ లు ఉండేవి. ఇటీవల కాలంలో ఆ స్మగ్లింగ్ వార్తలు కూడా పెద్దగా వినపడటం లేదు. కొత్తగా గంజాయి స్మగ్లింగ్ వ్యవహారం నెల్లూరుకి మాయని మచ్చలా మారింది. నెల్లూరు భౌతిక స్వరూపం కూడా దీనికి కొంత కారణం అని చెప్పుకోవాలి.
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏపీ తమిళనాడుకు సరిహద్దుగా ఉంది. ఇక్కడి వరకు గంజాయి తీసుకొస్తే అటునుంచి అటే తమిళనాడు చేరవేయవచ్చు. కర్నాటక వెళ్లాలంటే వయా తిరుపతి రూటు ఉండనే ఉంది. అందుకే నెల్లూరులో చాలా చోట్ల గంజాయి డంప్ లు పట్టుబడుతున్నాయి. నెల్లూరు చెక్ పోస్ట్ ల వద్ద కూడా పోలీసులు అలర్ట్ గా ఉండటంతో అక్రమ రవాణా గుట్టు చాలాసార్లు ఇక్కడే వీడింది. ఇక నెల్లూరులో గంజాయి వాడకంపై కూడా పోలీసులు నిఘా పెట్టారు.
ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిలో నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు కూడా ఉన్నారు. వీరిలో కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, మరికొందరు ఉన్నత విద్యావంతులు. వీరికి గోవాలో డ్రగ్స్ అలవాటయ్యాయని, గోవా నుంచి సరుకు తెప్పించి హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నారని పోలీసులు కనిపెట్టారు. గుట్టుగా నెల్లూరుకు చెందిన వారికే డ్రగ్స్ అమ్ముతున్నారని కూడా వారి పరిశోధనలో తేలింది. అయితే ఎట్టకేలకు ఆ గుట్టు వీడింది. హైదరాబాద్ పోలీసులు వారిని పట్టుకున్నారు.
ఏకంగా తయారీ కేంద్రం..
వీటన్నిటికీ మించి ఇటీవల నెల్లూరు రూరల్ మండల పరిధిలో డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టు రట్టు చేయడం హైలైట్ గా మారింది. ఏకంగా డ్రగ్స్ ని తయారు చేస్తున్నారనే వార్త టాక్ ఆఫ్ ఏపీగా మారింది. ఈ తయారీ కేంద్రంలో గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నెట్ లో పరిశోధించి మరీ డ్రగ్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్న కొంతమంది యువకులు నెల్లూరులో దీన్ని కుటీర పరిశ్రమగా ప్రారంభించడం విశేషం. దీనికి సంబంధించిన పరికరాలన్నిటినీ ఆన్ లైన్ లోనే కొనుగోలు చేశారు. తిరుపతిలో ముడి పదార్థాలు కొనుగోలు చేసి తయారీ ప్రారంభించారు. అయితే ఫైనల్ ప్రోడక్ట్ రాకముందే వీరిని పోలీసులు పట్టుకున్నారు. వరుస ఘటనలతో నెల్లూరు జిల్లా పేరు రాష్ట్రవ్యాప్తంగా మారిపోతోంది.