Bridge Collapse In Nellore: ప్రమాదం దాటితేనే కడుపు నిండేది.. చదువు వచ్చేది
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడులో కోవూరు కాలువ బ్రిడ్జ్ ఇలా ఇసుక లారీ వల్ల కూలిపోయింది.
అసలే ఇరుకైన దారులు. వాటిల్లో ఇసుక లారీల పరుగులు.. చిన్నా చితకా బ్రిడ్జ్ ల సామర్థ్యం ఎలా ఉందో కూడా చూసుకోకుండా లారీలు ఆ వంతెనలపైనుంచే వెళ్తుంటాయి. ఇలా ధైర్యం చేయడం వల్లే ఇప్పుడు ఆ ఊరికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడులో కోవూరు కాలువ బ్రిడ్జ్ ఇలా ఇసుక లారీ వల్ల కూలిపోయింది. టన్నులకొద్దీ ఇసుక లోడుతో వెళ్తే ఆ బ్రిడ్జ్ నిలబడదని స్థానికులు మొత్తుకున్నా లాభం లేదు. దీంతో ఇదిగో ఇలా లారీ బ్రిడ్జ్ పైనుంచి లోపలికి దిగబడింది.
వంతెన కూలిపోయి లారీ లోపలికి దిగబడిపోయింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ వెనక యాక్సిల్ విరిగిపోవడంతో ఇలా దాన్ని క్రేన్ కి తగిలించి బయటకు లాగేరు. అక్కడితో కథ అయిపోలేదు. వంతెన కూలిపోవడంతో కాగులపాడు వాసులకు కష్టాలు మొదలయ్యాయి. ఊరిలోనుంచి వెళ్లాలంటే అదొక్కటే వంతెన వారికి దిక్కు. దీంతో వారంతా కోవూరు కాలువలోకి దిగి వెళ్తున్నారు.
పనులకు వెళ్లే కూలీలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఇతర పనులపై బైక్ లు తీసుకెళ్లేవారు అందరూ ఆ కాలువను దాటి వెళ్తున్నారు. రాత్రి వేళల్లో కాగులపాడు రీచ్ నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుంటారని, భారీ వాహనాలకు అనుమతి లేదని తెలిసినా కూడా ఇటువైపు తీసుకెళ్తుంటారని ఆరోపిస్తున్నారు కాగులపాడు వాసులు. కేవలం లారీల వల్లే బ్రిడ్జి కూలిపోయిందని చెప్పారు.
జిల్లాలో అన్నిచోట్లా ఇంతే..
నెల్లూరు జిల్లాలో ఇసుక రీచ్ లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అయితే రీచ్ ల వద్దనుంచి ఇసుకను తీసుకెళ్లే లారీలు గ్రామాల్లో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామాల్లో రోడ్లు ఇలా లారీల వల్ల పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. అదే సమయంలో వాటికి ప్రత్యామ్నాయం కూడా లేదు. అందుకే లారీలు వెళ్తున్నా వాటిని అడ్డుకునే సాహసం చేయడంలేదు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వంతెనలపైనుంచి కూడా పెద్ద పోద్ద లోడ్ తో ఉన్న లారీలు వెళ్తుంటాయి. అలాంటి హెవీ లోడ్ వల్లే కాగులపాడులో బ్రిడ్జ్ కూలిపోయింది.
బ్రిడ్జ్ కూలిపోవడంతో కాగులపాడు వాసుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆ గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే కచ్చితంగా కాలువ దాటి వెళ్లాల్సిందే. రోజువారీ పనులపై వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఇబ్బంది ఎక్కువగా ఉంది. వెంటనే బ్రిడ్జిని పునర్నిర్మించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అందులోనూ ఏపీలో రోడ్ల మరమ్మతులే రకరకాల కారణాలతో ఆగిపోయాయి. ఇప్పుడిలా బ్రిడ్జ్ నిర్మించాలంటే దానికి మరింత ఆలస్యం అవుతుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు