Atmakur Bypoll: ఒక్కరే తగ్గారు, ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 14మంది పోటీ - ఫైనల్ లిస్ట్ ఇదీ
ఆత్మకూరు ఉప ఎన్నికల పోటీకి సంబంధించి తుది జాబితా రెడీ అయింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేలింది.
ఆత్మకూరు ఉప ఎన్నికల పోటీకి సంబంధించి తుది జాబితా రెడీ అయింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేలింది. ఈమేరకు ఆర్వో హరేంధిర ప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. 28 నామినేషన్లలో 13 తిరస్కరణకు గురి కాగా.. మొత్తం 15 మంది అర్హులుగా ఉన్నారు. వారిలో బొర్రా సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం 14మంది బరిలో నిలిచారు. ఈనెల 23న ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగుతుంది. 26న ఫలితాలు ప్రకటిస్తారు.
అధికార వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో నిలవగా.. బీజేపీ తరపున భరత్ కుమార్ పోటీలో ఉన్నారు. బీఎస్పీ తరపున నందా ఓబులేసు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ తమ అభ్యర్థులను పోటీలో లేకుండా చేశాయి. ఇక జనసేన కూడా పోటీకి దూరంగానే ఉంటామని ప్రకటించింది. మొత్తమ్మీద 14మంది అభ్యర్థులు ఇప్పుడు ఆత్మకూరు తుదిపోరుకి సిద్ధమయ్యారు.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 2,13,330 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో ఎన్నికలు నిర్వహిస్తూ డీఎంహెచ్ఓ ను నోడల్ అధికారిగా నియమించారు. పోస్టల్ బ్యాలెట్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వికలాంగులు, వృద్ధులు, కరోనా బాధితులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశముంది.
ఇక ప్రచారం విషయానికొస్తే.. అధికార వైసీపీ ఈ విషయంలో దూసుకుపోతోంది. బీజేపీ అధినాయకత్వం కూడా ఉప ఎన్నికపై ఫోకస్ పెంచింది. బీజేపీ తరపున కూడా కీలక నేతలు ఆత్మకూరులో పర్యటిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా, ఇతర రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు ఆత్మకూరులోనే మకాం వేశారు.
అధికార వైసీపీ ప్రచార పర్వాన్ని ఇప్పటికే ప్రారంభించింది. . ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి, ఒక ఎమ్మెల్యేని ఇన్ చార్జి లుగా నియమించారు. మొత్తం ఆరు మండలాలకు సంబంధించి ఇన్చార్జిల నియామకం పూర్తయింది.
- అనంతసాగరం మండలం - మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- ఏఎస్ పేట మండలం - మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
- ఆత్మకూరు టౌన్ - మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే శ్రీకాంత్
- ఆత్మకూరు రూరల్ - మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
- చేజర్ల మండలం - మంత్రి రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని
- మర్రిపాడు మండలం - మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
- సంగం మండలం - మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.
ఆత్మకూరులో ఈరోజు నుంచి మంత్రులు సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు.