(Source: ECI/ABP News/ABP Majha)
Actor Saichand: రియల్ హీరో: పాదయాత్రతో మరో మెట్టు ఎదిగిన సాయిచంద్
సినిమా నటులకు పారితోషికాలతో పని కానీ, పాదయాత్రతో పనేంటి..? పోనీ ఆయన పాదయాత్ర తర్వాత రాజకీయ అరంగేంట్రం చేయాలనుకుంటున్నారా..? ప్రచారానికి కూడా దూరంగా ఉన్న ఈ యాత్ర దేనికోసం..?
సినిమా నటులకు పారితోషికాలతో పని కానీ, పాదయాత్రతో పనేంటి..? పోనీ ఆయన పాదయాత్ర తర్వాత రాజకీయ అరంగేంట్రం చేయాలనుకుంటున్నారా..? తాను యాత్ర మొదలు పెడుతున్నట్టు టీవీ ఛానెళ్లకు, పేపర్లకు పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారా..? పోనీ ఏదైనా స్పెషల్ గా వాహనం తయారు చేసుకుని యాత్ర మొదలు పెడుతున్నారా..? వీటన్నిటికీ దూరంగా ఉన్న యాత్ర అది. నటుడు సాయిచంద్ మొదలు పెట్టిన యాత్ర.
ఎందుకీ యాత్ర..?
పొట్టి శ్రీరాములు. ఈ పేరు వింటే ఈ జనరేషన్ కి నెల్లూరు జిల్లాకు ముందు చేర్చిన పదం అని మాత్రమే తెలుసు. కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు స్వరాష్ట్రం కోసం అసువులు బాశారనే విషయం ఈ తరం దాదాపుగా మరచిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక ఆంధ్ర అంటే తెలంగాణ నుంచి విడిపోయిన రాష్ట్రం, రాజధాని ఒకటో, మూడో తేల్చుకోలేకపోతున్న రాష్ట్రంగానే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో అసలు అమర జీవి ఎవరు, ఆయన దేనికోసం త్యాగం చేశారు, ఆయన త్యాగాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది అ చర్చ మొదలు కావడానికే సాయిచంద్ పాదయాత్ర మొదలు పెట్టారు.
ఎవరీ సాయిచంద్..?
ఇంతకీ ఈ సాయిచంద్ ఎవరు. మెగా స్టార్ కాదు, సూపర్ స్టార్ కాదు, అసలు స్టారే కాదు అనుకోవద్దు. ఆయన సామాజిక స్టార్. సామాజిక చైతన్యం కలిగించే సినిమాల్లో నటించారు. నటన వారసత్వం కాకపోయినా, సామాజిక స్పృహ అనేది ఆయనకు వారసత్వంగా అబ్బిన కళ. ఆయన తండ్రి త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ రచయిత. అసమర్థుని జీవిత యాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, చీకటి గదులు వంటి ఎన్నో అద్భుతమైన నవలలు రాశారు. రైతుబిడ్డ, గృహప్రవేశం, చదువుకున్న అమ్మాయిలు వంటి సినిమాలకు మాటలు రాశారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. గోపీచంద్ తండ్రి.. అంటే సాయిచంద్ తాత ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. ఆయనకు కవిరాజు అనే బిరుదు కూడా ఉంది. స్వాతంత్ర సమరయోధుడు కూడా. అలాంటి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సాయిచంద్ సినీ నటుడిగా కంటే సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తిగా అందరికీ గుర్తుండిపోతారు.
యాత్ర ఎలా సాగుతోంది..?
అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ఉద్యమం, నిరాహార దీక్ష, ప్రాణత్యాగం ఈ తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోటే సాయిచంద్ పాదయాత్ర చేపట్టారు. దీనికి కాలినడక దీక్ష అనే పేరు పెట్టారు. చెన్నైలోని మైలాపూర్ లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం భవనం వద్ద పొట్టి శ్రీరాములు జయంతి రోజున అంటే ఈనెల 15న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి యాత్ర మొదలు పెట్టారు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతోనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారాయన. ఆయన చేసిన ప్రాణత్యాగం ప్రస్తుత తరానికి తెలియజేసేందుకే కాలినడక దీక్ష చేపట్టానన్నారు. తమిళనాడులో మొదలైన ఈ యాత్ర ఏపీలో ముగుస్తుంది. ప్రకాశం జిల్లా పడమటి పల్లె వరకు యాత్ర కొనసాగుతుంది.
వాస్తవానికి నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టినా ఆయన ప్రకాశం జిల్లా వాసి. అప్పట్లో ప్రకాశం పేరుతో జిల్లా లేదు, పడమటి పల్లె కానీ, కనిగిరి కానూ నెల్లూరు ప్రాంతంలోనే కలసి ఉండేవి. మద్రాసులో విద్యాభ్యాసం చేసిన పొట్టి శ్రీరాములు బొంబాయిలో ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత గాంధీజీ ఆశయాల పట్ల ఆకర్షితులై స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. స్వాతంత్ర్యానంతరం ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు. 58రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టి చివరకు రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలారు. అలాంటి మహా నాయకుడి ఆశయాలకోసం చెన్నై నుంచి ప్రకాశం జిల్లాకు యాత్ర చేపడుతున్న సాయిచంద్ నిజంగా రియల్ హీరో అనిపించుకుంటున్నారు.