Nellore Murder: లిక్కర్ తాగించాడు.. చీరతో ఉరేసి చంపాడు.. ఇన్నాళ్లకు చిక్కాడు
రెండు పెళ్లిళ్లు చేసుకున్న బుద్ది మారలేదు. భర్త, భార్య మధ్య సఖ్యత లేనే లేదు. ఫలితం ఒకరు హత్యకు గురికాగా.. మరొకరు జైలు పాలయ్యారు.
నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం తెల్లగుంట గ్రామంలో జరిగిన శ్యామల హత్యకేసులో పోలీసులు ముద్దాయిని అరెస్ట్ చేశారు. రెండో భర్త యాకోబ్ అలియాస్ బద్రీ ఆమెను చీరతో ఉరేసి చంపినట్టు నిర్థారించారు. హత్యకు ముందు ఇద్దరూ కలసి మద్యం సేవించారని, మద్యం మత్తులో ఉన్న శ్యామలను భర్త బద్రీ చీరతో ఉరేసి చంపేశాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న బద్రీ వీఆర్వో వద్ద లొంగిపోయాడని చెప్పారు.
శ్యామల, చిరంజీవి దంపతులు. పెళ్లైన కొన్నాళ్లకే భర్త చిరంజీవి చనిపోయాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న శ్యామల చెడు వ్యసనాలకు బానిసైంది. ఈ క్రమంలో ఆమెకు యాకోబ్ అలియాస్ బద్రీ అనే వ్యక్తి స్నేహం కుదిరింది. బద్రి కూడా తన భార్యకు దూరంగా ఉన్నాడు. ఇద్దరూ కలసి కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
రెెండోసారి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా శ్యామల ప్రవర్తన మారలేదు. బద్రి కాకుండా మరో వ్యక్తితో చనువుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తరచూ మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానించిన బద్రి ఎలాగైనా శ్యామలను చంపేయాలనుకున్నాడు.
శ్యామలకు ఓరోజు బాగా మద్యం తాగించి, ఆ మత్తులో ఆమెకు చీరతో ఉరేసి చంపేశాడు బద్రి. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నా కుదరలేదు. దీంతో బద్రి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. గతల నెల 16న శ్యామల హత్య జరగగా.. ఇప్పటి వరకు యాకోబు తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులు హత్య కేసులో తనని వెదుకుతున్నారని తెలిసి, తానే వీఆర్వో ముందు లొంగిపోయాడు. కట్టుకున్న భార్యనే దారుణంగా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్న బద్రి చివరకు కటకటాలపాలయ్యాడు. చెడు వ్యసనాలకు బానిసై.. బద్రి వంటి నయవంచకుడితో సహజీవనం చేసి పెళ్లి చేసుకున్న పాపానికి శ్యామల ప్రాణం కోల్పోయింది.