ISRO: భారత రాకెట్ ప్రయోగాలకు 60ఏళ్లు - SLV నుంచి GSLV వరకు ఎన్నో మైలురాళ్లు
భారత్ లో నిర్వహించిన తొలి రాకెట్ ప్రయోగం 59ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయోగం జరిగి ఇది 60వ ఏడాది. 1963 నవంబర్ 21న నైక్ అపాచి అనే రెండు దశల సౌండింగ్ రాకెట్ ని మొదటిసారిగా ప్రయోగించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) 1969లో స్థాపించినా అంతకు ముందు ఎనిమిదేళ్లుగా అంతరిక్ష రంగంలో ఆధునిక శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేశారు. 1961లో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అంతరిక్ష ప్రయోగాలకోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE)ని ప్రారంభించారు. DAE సంస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చిగా మార్చారు. ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనలు మరింత వేగవంతం అయ్యాయి.
తొలి రాకెట్ ప్రయోగానికి 60ఏళ్లు..
భారత్ లో నిర్వహించిన తొలి రాకెట్ ప్రయోగం 59ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయోగం జరిగి ఇది అరవయ్యో ఏడాది. సరిగ్గా 59ఏళ్ల క్రితం... అంటే 1963 నవంబర్ 21న నైక్ అపాచి అనే రెండు దశల సౌండింగ్ రాకెట్ ని మొదటిసారిగా ప్రయోగించారు.
ఇప్పుడు మనకు శ్రీహరికోటలో లాంఛింగ్ స్టేషన్లు ఉన్నాయి కానీ, అప్పటికి అసలు షార్ కేంద్రమే లేదు. రాకెట్ ప్రయోగాలకు శాశ్వత వేదికంటూ లేదు. కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ (TERLS) ని ఏర్పాటు చేశారు. తిరువనంతపురం విమానాశ్రయానికి పక్కనే ఉన్న చిన్న మత్స్యకార గ్రామం ఇది. అయితే ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడం, సముద్ర తీరం కావడంతో దీన్ని రాకెట్ ప్రయోగాలకు ఉపయోగించారు. ప్రస్తుతం ఇది ఇస్రో అధీనంలో ఉంది. సౌండింగ్ రాకెట్లను ఇక్కడినుంచే ప్రయోగిస్తుంటారు.
1963 నవంబర్ 21న ‘నైక్ అపాచి’ అనే రెండు దశల సౌండింగ్ రాకెట్ ను మొదటిగా ఇక్కడ ప్రయోగించారు. ఈ ప్రయోగం భారత్ లో జరిగినా దీనికి విదేశీ సాంకేతిక సహాయం అవసరమైంది. ఈ ప్రయోగం జరిగి ఇప్పటికి అరవయ్యేళ్లు. ఆ తర్వాత 1967 నవంబర్ 20న రోహిణి–75 అనే సౌండింగ్ రాకెట్ ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఆ ప్రయోగం కూడా విజయవంతం అయింది.
ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)గా మార్చారు. ఆ తర్వాత శ్రీహరికోట భారత రాకెట్ ప్రయోగాలకు వేదికగా మారింది. 1969 ఆగస్ట్ 15న ఇస్రోని స్థాపించారు. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనే పేరుతో షార్ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ లోని పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న శ్రీహరికోట దీవిలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని భావించారు. ఆ నమ్మకాన్ని శ్రీహరికోట అనతికాలంలోనే నిలబెట్టుకుంది. slv, aslv, pslv, gslv, gslv మార్క్-3 ప్రయోగాలు ఇక్కడ జరిగాయి.
శ్రీహరికోట రాకెట్ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10న slv – 3ఇన్1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1980 జూలై 18న slv ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 86 ప్రయోగాలు చేసి 116 ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశ పెట్టారు. 13 స్టూడెంట్ ఉపగ్రహాలు, రెండు రీఎంట్రీ మిషన్లు, 381 విదేశీ ఉపగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. మూడు గ్రహాంతర ప్రయోగాలు కూడా ఇక్కడినుంచే జరిగాయి. ఇటీవలే తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం కూడా విజయవంతమైంది.
వీటన్నిటికీ తొలిమెట్టుగా భావించే తుంబా కేంద్రం స్థాపన, అక్కడ రాకెట్ ప్రయోగం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తొలి ప్రయోగం జరిగి ఇది అరవయ్యో సంవత్సరం కావడంతో దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి.