Nellore News : ఎవరైనా జగన్ ఫొటో పెట్టుకునే గెలవాలి : మాజీ మంత్రి అనిల్ కుమార్
Nellore News : నెల్లూరు జిల్లాలో తాజా, మాజీ మంత్రుల బలప్రదర్శన ప్రశాంతంగానే ముగిసింది. అయితే మాజీ మంత్రి అనిల్ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఆ ఇద్దరి ఎమ్మెల్యేల పేర్లు తన సభలో ప్రస్తావించలేదని తెలుస్తోంది.
Nellore News : నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచీ టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజా, మాజీ మంత్రుల సభలతో ఇరువర్గాల్లో ఏం జరుగుతోందన్న చర్చ జోరుగా సాగింది. అధిష్టానం జోక్యంతో కాస్త తగ్గిన నేతలు పరస్పర విమర్శలకు దూరంగా ఉన్నారు. ఇద్దరూ నేతలు తమ అనుచరులు, కార్యకర్తలతో ప్రశాంతంగానే సభలు నిర్వహించారు.
నాకు నేనే పోటీ : మాజీ మంత్రి అనిల్
నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకటే వర్గం అంటూనే మరోసారి ఉద్దేశ పూర్వకంగానే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు పక్కనపెట్టారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాను మంత్రి పదవిలో ఉండగా సహకరించిన జిల్లా ఎమ్మెల్యేలందరికీ థ్యాంక్స్ అంటూనే కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేరెత్తలేదు. మిగతా అందరి పేర్లు చెప్పి మరీ వారికి ధన్యవాదాలు చెప్పారు. తాను మళ్లీ పూర్తి స్థాయిలో జనంలోకి వస్తానని, గడపగడపకీ వెళ్తానని చెప్పారు. తనకు అండగా ఉన్న అందరికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు. సీఎం జగన్ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పారు అనిల్. తాను బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకటే వర్గం అని, ఎవరైనా జగన్ ఫొటో పెట్టుకుని గెలవాల్సిందేనన్నారు అనిల్. నాకు నేనే పోటీ అని స్పష్టం చేశారు అనిల్. 2024లో గెలిచి తిరిగి మంత్రి పదవిలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు అనిల్.
అనిల్ సభపై కాకాణి ఫస్ట్ రియాక్షన్
అందరూ అనుకున్నట్టుగానే నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి ఎంట్రీ అదిరిపోయింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సభ, మంత్రి కాకాణి అభినందన ర్యాలీ ఒకేరోజు ఉండటం, ఇటీవల కాకాణిపై అనిల్ మాటల తూటాలు పేల్చడంతో ఈ వ్యవహారం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓ దశలో పార్టీ హైకమాండ్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందనే వార్తలొచ్చాయి. అయితే మంత్రిగా తొలిసారి జిల్లాలో అడుగు పెట్టిన కాకాణి, అనిల్ కుమార్ యాదవ్ సభపై క్లారిటీ ఇచ్చారు. అది తనకు పోటీ సభ ఎంతమాత్రం కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా స్థానికంగా సభ పెట్టుకోవడం పార్టీకోసమేనన్నారు. మీడియా దాన్ని పోటీసభగా చిత్రీకరించడం సరికాదన్నారు కాకాణి. కావలిలో తనకు లభించిన స్వాగతాన్ని తాను మరచిపోలేనని చెప్పారు కాకాణి.
Also Read : Nellore: నెల్లూరు రాజకీయ రచ్చపై వైసీపీ దృష్టి - వారిద్దరి మధ్య రాజీకి మార్గం ఇదే!