Mekapati Goutham Reddy : గౌతంరెడ్డి లేని రాజకీయాలా ? నెల్లూరు జిల్లాలో అభిమానుల ఆవేదన !
గౌతంరెడ్డి మృతిపై నెల్లూరు జిల్లా నేతలు ఆవేదన చెందుతున్నారు. గౌతంరెడ్డి లేని రాజకీయాలను వారు ఊహించలేకపోతున్నారు.
నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో ( YSRCP ) మేకపాటి గౌతంరెడ్డి కీలకంగా ఎదుగుతున్నారు. పార్టీ పెద్దలు ఎప్పుడు వచ్చినా మేకపాటి ఆధ్వర్యంలోనే మంతనాలు సాగేవి, మేకపాటి కార్యాలయమే ( Mekapati Office ) అన్ని రకాల చర్చలకు వేదికగా నిలిచేది. అందరినీ సమన్వయ పరుచుకుంటూ గౌతమ్ రెడ్డి జిల్లాలో పార్టీలో కీలకంగా మారారు. అందిరినీ అన్నా అన్నా అంటూ ఆప్యాయంగా పలకరిస్తారని గుర్తు చేసుకున్నారు సహచర ఎమ్మెల్యేలు. నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకోగా.. మంత్రి పదవులు దక్కించుకున్న ఇద్దరిలో ఒకరు మేకపాటి గౌతమ్ రెడ్డి. రాజకీయాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించే క్రమంలో ఆయన అకాల మరణం చెందారు.
దూకుడైన పార్టీలో సంప్రదాయ నేత ! ఎవర్నీ అనని, అనిపించుకోని లీడర్ గౌతంరెడ్డి !
నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ నాయకులు గౌతమ్ రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో గౌతమ్ రెడ్డి ( Goutham Reddy ) చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి మేకపాటి మరణంతో ఆత్మకూరు ( Atmakur ) నియోజకవర్గంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు నివాళిగా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ప్రభుత్వ సిబ్బంది. ఆత్మకూరులోని దాదాపు అన్ని కూడళ్లలో ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నివాళులర్పించారు నేతలు, కార్యకర్తలు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణానికి రెండురోజులపాటు ఏపీ ప్రభుత్వతం సంతాప దినాలుగా ప్రకటించింది.
సంపూర్ణ ఆరోగ్యం - క్రమం తప్పని వ్యాయామం ! అయినా ఎందుకిలా ?
ఇటు గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా వ్యాపార వర్గాలు ఆయన మృతికి నివాళిగా షాపులు మూసివేశాయి. గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు వ్యాపారులు. ఆత్మకూరులో స్వచ్ఛందంగా షాపులు మూసివేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గౌతమ్ రెడ్డి కారణంగా తాము రాజకీయాల్లోకి వచ్చామని, ఆయన వల్లే పదవుల్లో ఉన్నామని గుర్తు చేసుకుంటున్నారు యువ నాయకులు. ఏ ఆరోగ్య సమస్యలూ లేని మేకపాటి హఠాత్తుగా చనిపోవడం అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
మేకపాటి చివరి పర్యటన ఇదే, దుబాయ్‌లో ప్రముఖులతో - ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు
నెల్లూరు జిల్లాతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో అతి కొద్ది కాలంలోనే తనదైన ముద్ర వేసిన ఘనత మేకపాటికి దక్కింది. వృద్ధాప్యం కారణగా తండ్రి రాజమోహన్ రెడ్డి ఇంటికే పరిమితమైనా రాజకీయ వారసత్వాన్ని మాత్రం చురుగ్గా ముందుకు తీసుకెళ్లారు. కానీ ఆయన హఠాన్మరణం అటు కుటుంబాన్ని.. ఇటు వైఎస్ఆర్‌సీపీని కూడా ఇబ్బంది పెడుతోంది.