Neerabh Kumar: నూతన సీఎస్‌గా నీరభ్ కుమార్ బాధ్యతలు - సీఎంవో నుంచి ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ
Andhrapradesh News: ఏపీ నూతన సీఎస్‌గా నీరభ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో సీఎంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Neerabh Kumar Prasad Took Charge As New CS Of AP: ఏపీ నూతన సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో టీటీడీ వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు సీఎస్‌గా అవకాశం కల్పించిన గవర్నర్, సీఎంగా ప్రమాణం చేయబోయే చంద్రబాబులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సహచర అధికారులు, సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత అమలు చేసేలా పని చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి, ఐటీ కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఇప్పటివరకూ సీఎస్‌గా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో గవర్నర్ ఆ బాధ్యతలను నీరబ్ కుమార్‌కు అప్పగించారు.
20 రోజులే..
ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే.. కీలక అధికారుల మార్పుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 1987 బ్యాచ్‌కు ఏపీ కేడర్‌కే చెందిన నీరబ్‌కుమార్ ఇప్పుడు అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు చేపడుతున్నారు. ఈయన ఈ నెలలోనే రిటైర్‌మెంట్ తీసుకోనున్నారు. 20 రోజుల కోసమే నీరబ్‌కుమార్‌ను సీఎస్‌గా నియమిస్తున్నారు. ఆ తర్వాత విజయానంద్ కానీ లేదా వేరే వ్యక్తిని నియమించే ఛాన్స్ ఉంది. కాగా, ఇప్పటివరకూ సీఎస్‌గా ఉన్న జవహర్ రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారని.. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటు కానుండడంతో జవహర్ రెడ్డే (Jawahar Reddy) సెలవుపై వెళ్లిపోయారు. ఆయన్ను బదిలీ చేసిన గవర్నర్.. కొత్తగా సీఎస్‌గా నీరబ్ కుమార్‌ను నియమించారు.
ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ
సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన నీరబ్ కుమార్ తొలి రోజే కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎంవోలో విధులు నిర్వహిస్తోన్న ముగ్గురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వైసీపీ అధినేత జగన్ హయాంలో వీరు కీలకంగా వ్యవహరించారు. జగన్ పేషీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య, సెక్రటరీగా రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీగా భరత్ గుప్తాలు వ్యవహరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కనపెడుతున్నారు. జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగక ముందే సీఎంఓలో కీలక అధికారులను మారుస్తారని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వ హయాంలో కొత్త టీమ్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.