Nara Lokesh ChitChat: పరకామణి దొంగతనంపై సిట్ విచారణ - అన్నీ బయటకు వస్తాయి - నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Tirumala : తిరుమల పరకామణి దొంగతనం ఘటనపై సిట్ వేస్తామని నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో పలు అంశాలపై మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా పలు అంశాలపై మాట్లాడారు.

Nara Lokesh says SIT will be formed on Tirumala Parakamani theft case: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తితిదే పరకామణి వ్యవహారంలో త్వరలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు, మెగా డీఎస్సీ , పెట్టుబడులు, పీపీపీ మోడల్ వంటి అంశాలపై వివరంగా మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ చర్యలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాలపైనా తన అభిప్రాయాలు చెప్పారు.
పరకామణి దొంగతనం అంశంపై సిట్
తిరుమల శ్రీవారి పరకామణి కేసులో త్వరలోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పరకామణి దొంగలను అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి పంపిచేశారని అన్నారు. "జగన్ అండ్ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారు. అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడు" అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని, తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా కీలక ఆధారాలు బయటపడుతున్నాయని తెలిపారు. ఈ చర్యలు అక్రమాలను వెలికితీసి అక్రమార్కులను శిక్షించడం చాలా ముఖ్యమని అన్నారు.
ఏటా డీఎస్సీ నిర్వహణ
మెగా డీఎస్సీ కు ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేశామని మంత్రి గర్వంగా చెప్పారు. "106 కేసులు ఎదుర్కొని కార్యక్రమాన్ని జయప్రదం చేశాము" అని పేర్కొన్నారు. నియామకపత్రాల అందజేతకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. "తప్పకుండా వస్తానని ఆయన చెప్పారు" అని తెలిపారు. ఏటా ఓ పద్ధతి ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేస్తుందన్నారు. అక్టోబర్ నుంచి రాష్ట్రానికి వరుస పెట్టుబడులు తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. "20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నిర్విరామ కృషి జరుగుతోంది" అని చెప్పారు. ఈ ప్రణాళికలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, యువత ఉపాధికి బలోపేతం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాన్యులకు మెరుగైన వైద్య సేవల కోసమే పీపీపీ మోడల్
ప్రజా-ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేట్‌ను భాగస్వామ్యం చేయడం ప్రైవేటీకరణ కాదని లోకేశ్ స్పష్టం చేశారు. "సామాన్యుడికి మెరుగైన సేవలు త్వరగా తెచ్చేందుకే పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో వైద్యకళాశాలలు, రోడ్లు, విమానాశ్రయాలు ఇలా అనేక విషయాల్లో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏ పనులూ చేయలేదని, "మమ్మల్నీ చేయనివ్వమంటే ఎలా? తన మనుషులకు ఇచ్చిన కాంట్రాక్టులు పోతున్నాయనే ఆందోళన ఆయనలో ఉన్నట్టుంది" అని విమర్శించారు. ఈ మోడల్ ద్వారా సేవలు వేగవంతమవుతాయని, ప్రభుత్వ బాధ్యతలు తగ్గవని స్పష్టం చేశారు.





















