Kakinada PDS Rice Issue: కాకినాడను వీడని పిడిఎస్ బియ్యం భూతం..! దీని గురించి మళ్లీ రగడ ఎందుకు జరుగుతుంది..?
Kakinada PDS Rice Issue: కాకినాడ కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కూటమి ప్రభుత్వం వచ్చినా అడ్డుకట్టవేయలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Kakinada PDS Rice Issue: కాకినాడ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బీచ్ అనుకుంటారంతా... లేదా పోర్ట్ అనుకుంటారు.. కానీ రాజకీయ విమర్శలపరంగా వెంటనే గుర్తుకు వచ్చేది కాకినాడ పోర్ట్ కేంద్రంగా నడిచే అక్రమ పీడీఎస్ బియ్యం మాఫీయా గురించే. సంవత్సరాల కాలంగా వేళ్లూనుకుపోయిన ఈ మాఫియాను అడ్డుకట్ట వేయాలంటే కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే తప్ప మరో మార్గం లేదన్న వాదను ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఎందకంటే గత వైసీపీ పాలనలో ఈ మాఫికా కార్యకలాపాలకు గేట్లు ఎత్తేశారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలే టార్గెట్‌గా అప్పట్లో ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కీలక ఆరోపణలు చేస్తూ అధికారంలోకి రాగనే మీ తాట తీస్తామని హెచ్చరించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలల సమమం గడుస్తున్నా కాకినాడ పోర్టు కేంద్రంగా నడుస్తోన్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఏమాత్రం అడ్డుకట్టపడలేదన్నది పలువురి మాటగా వినిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని ఇటీవలే అమరావతి జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ డిప్యూటీ సీఎం సంధించిన పలు ప్రశ్నలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇది రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నలకే పరిమితం అయ్యారా అన్న విమర్శలొస్తున్నాయి.
పవన్ ఎందుకు ఇలా ప్రశ్నించారు..?
ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో కాకినాడ కేంద్రంగా జరుగుతోన్న అక్రమ బియ్యం రవాణా విషయంలో కీలకంగా వ్యాఖ్యానించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని హెచ్చరించారు కూడా. అయితే కూటమి ప్రభుత్వం కోలువు తీరింది.. ఒకసారి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో తనిఖీలు చేశారు. సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పలుసార్లు పోర్టులో తనిఖీలు చేసి కొంత సరుకును సీజ్‌కూడా చేయించారు. కానీ ప్రస్తుతం వినిపిస్తోన్న మాట కాకినాడ కేంద్రంగా సాగుతోన్న పీడీఎస్ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకట్టవేయలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తోన్నాయి.. ఈ కారణమే ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలు సంధించారన్న ప్రచారం జరుగుతోంది. కూటమికి చెందిన నేతలు, అధికారులు, పీడీఎస్ అక్రమ రవాణా మాఫియాతో కలిసిపోయారని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతుచిక్కని ప్రశ్నలు.. సమాధానాలే కరవు..
పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఎందుకు పెరిగింది? గత ఐదు సంవత్సరాల్లో కాకినాడ పోర్ట్ కేంద్రంగా పిడిఎస్ బియ్యం నమూనా పేరుతో ఎగుమతులు జరుగుతున్నాయి. రేషన్ డీలర్లు, మిల్లర్లు, స్మగ్లర్ల మధ్య నెట్‌వర్క్ ఏర్పడి రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరలో బియ్యం కొని, తిరిగి మిల్లింగ్ చేసి, పెద్దలకి అధిక ధరకు అమ్ముతున్నారని విచారణల్లో తేలితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? ప్రభుత్వ నేతలు, కొన్ని పోలీసు అధికారులు నుంచి కూడా మద్దతు ఉన్నట్లు ఆరోపణలు రావడం వెనుక వాస్తవం ఎంత.? 2024లో కాకినాడ పోర్ట్ ద్వారా సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నులపైగా బియ్యం ఎగుమతి అయినట్లు అధికార లెక్కలు చూపిస్తున్నాయి. ఇందులో అక్రమ పీడీఎస్ బియ్యం వాటా ఎంత.? ఇలా అనేక ప్రశ్నలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయంటున్నారు.
చర్యలు చేపట్టనా వారి పని వారిదేనా...
కాకినాడ పోర్టు కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై జరుగుతోన్న చర్చ అటుంచితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిసై దృష్టిసారించి చర్యలు ప్రారంభించారనే చెప్పవచ్చు. కాకినాడ పోర్టుపై నియంత్రణ, అక్రమ బియ్యం రవాణా నిరంతర నిఘా.. అధిక చెక్‌పాయింట్లు తనిఖీలు.. అధికారుల నిరంతర తనిఖీల ద్వారా బియ్యం సంబంధిత గోదాములు, లారీలు సీజ్ చేస్తోంది.. ఇటీవలే 85 కేసులు కాకినాడలో నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో చూపిన ఉత్సాహం నీరుకారిపోయిందని, ప్రస్తుతం కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతులు ఏమాత్రం తగ్గలేదని, కానీ పట్టించుకునే నాధులే కరవయ్యారని మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు..




















