Nara Bhuvaneswari : చంద్రబాబు పోరాటం రాష్ట్రం కోసం - ప్రజలే కాపాడుకుంటారన్న భువనేశ్వరి !
చంద్రబాబు పోరాటం రాష్ట్ర ప్రజల కోసమేనని నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు.
Nara Bhuvaneswari : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య భువనేశ్వరి స్పందించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం తన సోదరుడు రామకృష్ణతో కలిసి మీడియాతో ఆమె మాట్లాడుతూ... తన భర్తను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
'ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఒక బిడ్డకు మనసు బాగో లేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తాడు. అందుకే విజయవాడ కనకదుర్గమ్మకు నా బాధను చెప్పుకోవడానికి, ఆమె ఆశీర్వచనం కోసం ఇక్కడకు వచ్చాను. అమ్మవారిని నేను కోరింది ఒకటే. మా ఆయన చంద్రబాబును రక్షించమని, ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నా. ఆయన పోరాటం ఆయన ఒక్కరి కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదు. ఆయన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం. నేను ఒక్కటే కోరుతున్నా... మీ అందరి కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయిచేయి కలపాలి. జై దుర్గాదేవి, జైహింద్, జై అమరావతి' అని భువనేశ్వరి అన్నారు.
చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడ తీసుకొస్తున్నందున ఆయన్ని కలిసేందుకు భువనేశ్వరి విజయవాడ చేరుకున్నారు. ప్రజలే చంద్రబాబును కాపాడుకుంటారని... అంతా చేయి చేయీ కలిపి కదలాల్సిన టైం వచ్చిందని అభిప్రాయపడ్డారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర కు విరామం ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ క్రమంలో లోకేష్ విజయవాడకు బయల్దేరారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబును చూసేందుకు నేతలతో కలిసి యువగళం పాదయాత్ర క్యాంప్‌సైట్ నుంచి విజయవాడకు బయల్దేరారు. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో లోకేష్ పాదయాత్ర చేస్తుండగా.. చంద్రబాబు అరెస్ట్ క్రమంలో విజయవాడకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో విజయవాడ వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అనుమతి నిరాకరించారు. తన తండ్రిని చూసే హక్కు తనకు ఉంటుందని, అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉదయం నుంచి లోకేష్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు మధ్యాహ్నం అనుమతించడంతో కోనసీమ జిల్లాలోని పొదలాడ యువగళం క్యాంప్‌సైట్ నుంచి లోకేష్ విజయవాడ బయల్దేరారు.