Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Andhrapradesh News: అనుమానాస్పదంగా ఇద్దరు మరణించడంతో అక్కడి గ్రామస్థుల్లో భయం పట్టుకుంది. మా ఊరికి దెయ్యాలతో ప్రమాదం పొంచి ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. అల్లూరి జిల్లాలో ఓ గ్రామం మిస్టరీ కథ ఇదీ!
Mysterious Deaths In Chuttumetta In Alluri District: దాదాపు 50 గడపలు.. 350 మంది నివాసం.. పల్లె వాతావరణం. ఎప్పుడూ ఐకమత్యంగా ఉండే గ్రామస్థులు. ఇదీ ఆ గ్రామంలో ఒకప్పటి పరిస్థితి. కానీ, ఇప్పుడు ఎవరి కళ్లల్లో చూసినా భయం. ఎవరిని కదిలించినా ఏదో ఆందోళన. 'అమ్మో మా ఊరికి దోషం పట్టింది. దెయ్యాలతో గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది.' అంటూ అక్కడి గ్రామస్థులు భయాందోళనలతో చెబుతున్నారు. ఇటీవలే కొందరు గ్రామస్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పాటు జరిగిన కొన్ని సంఘటనలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో రాత్రీ పగలూ అనే తేడా లేకుండా అందరూ కలిసి గుంపులుగా సంచరిస్తున్నారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుముట్ట గ్రామంలోని మిస్టరీ మరణాలు, దెయ్యం పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇదీ జరిగింది
చుట్టుమెట్ట గ్రామంలో జూన్ 19న ముగ్గురు మహిళలు అడవికి కట్టెల కోసం వెళ్లారు. అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో అనసమ్మ అనే మహిళ అటు చూడగా ఓ వింత ఆకారం కనిపించిందని చెబుతున్నారు. దాన్ని చూసిన ఆమె భయంతో పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి వెంటనే స్పృహ కోల్పోయింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు త్రినాద్ అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడికి విషయం చెప్పాడు. గొరవడుగా పిలవబడే బూతవైద్యుడు కిముడు సహదేవ్ అనసమ్మకు మంత్రోచ్చారణ చేస్తూ విభూది జల్లాడు. ఈ క్రమంలో మంత్రాలు చదువుతున్న సహదేవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి వాంతులు విరేచనాలతో మృతి చెందాడు. ఇది చూసిన గ్రామస్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అనసమ్మకు సపర్యలు చేస్తోన్న ఆమె తమ్ముడు త్రినాథ్ మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థుల భయం రెట్టింపైంది.
'మీ తొడ భాగం కావాలి'
అనంతరం మృతి చెందిన ఇద్దరికి దహన సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకెళ్లగా.. కొందరు చితి ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒకరి నోటి నుంచి 'ఏయ్ మీరెందుకు వచ్చారు. ఇప్పటికే ఇద్దరి పని అయిపోయింది. నీ తొడ భాగం కావాలి.' అంటూ కోరారని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో మరింత ఆందోళన చెందుతున్నారు. మిస్టరీ మరణాలు, ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తమ ఊరికి ఏదో దోషం పట్టిందని గ్రామస్థులు భయాందోళనలతో మీడియా ప్రతినిధులతో చెప్పారు. వరుస ఘటనలతో గ్రామస్థులు ఏ పనికి వెళ్లాలన్నా గుంపులుగానే వెళ్తున్నారు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. మరోవైపు, వైద్య శాఖకు చెందిన ఏఎన్ఎం గ్రామానికి చేరుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు చొరవ చూపి గ్రామస్థులకు అవగాహన కల్పించాలని.. పలువురు కోరుతున్నారు.
పల్నాడులోనూ..
మరోవైపు, పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం చిన్నతురకపాలెంలోనూ క్షుద్రపూజలు కలకలం రేపాయి. 15 రోజుల క్రితం ఓ వ్యక్తి ఇంటి ముందు గోడకు మేకులు కొట్టి కనిపించాయి. ఆ తర్వాత రోజు చెట్టుకు సైతం మేకులు కొట్టి కనిపించాయి. మొదటి గ్రామస్థులు అంతగా పట్టించుకోలేదు. అయితే, ప్రతిరోజూ అలానే మేకులు కొట్టి కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, ఇప్పుడు పసుపు, కుంకుమ సైతం కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామస్థులు కంటి మీద కునుకు లేకుండా నిరంతరం భయంతో వణుకుతున్నారు. ఊరిలో ఎవరో చేతబడి చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.