TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !
రాజధానికి ఓ కొత్త ఫార్ములాను బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సీఎం జగన్‌కు ప్రతిపాదించారు. ఆయన ఓకే అంటే బీజేపీని ఒప్పిస్తానన్నారు. అసలా ఫార్ములా ఏమిటంటే ?
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మూడు రాజధానుల విషయంలో కీలకమైన సూచనలు చేశారు రాజ్యసభ ఎంపీ , రాయలసీమ హక్కుల పోరాట నేత టీజీ వెంకటేష్. తన సూచనలు అంగీకారమైతే తాను బీజేపీని ఒప్పిస్తానని ఆయన జగన్‌కు ఆఫర్ ఇచ్చారు. అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధానిగా ఉండేదని.. తర్వాత కూడా ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉందన్నారు. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీ కృష్ణ కమిటీకి తెలియజేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల కర్నూలుకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి ఉందన్నారు.
Also Read: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష
‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితిని సీఎం జగన్ మార్చేశారని టీజీ వెంకటేష్ ఆరోపించారు. అమరావతిని అలాగే ఉంచి కర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ పెట్టాలని టీజీ వెంకటేష్ సూచించారు. తన నేతృత్వంలోని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదటి నుంచి ఇదే డిమాండ్ చేస్తోందన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ను వెంటనే ఏర్పాటు చేయాలని.. తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలన్నారు. లేకపోతే రెండూ పోతాయని టీజీ హెచ్చరించారు.