MP Raghurama About CM Jagan: విశాఖ కేంద్రంగా పాలనపై సీఎం జగన్ మాట తప్పారు, ఎంపీ రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై ఎంపీ రఘురామ కృష్ణరాజు పలు విమర్శలు చేశారు.
విశాఖపట్నం నుంచే పాలన విషయంలో సీఎం జగన్ మాట తప్పారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని అందుకే ఇప్పుడు ఆకస్మాత్తుగా మార్గదర్శి కేసును తీసుకువచ్చారని చెప్పారు. చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు పూర్తయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబును ఇన్ని రోజులు జైల్లో ఉంచడం బాధాకరమని చెప్పారు. విశాఖపట్నం నుంచి పాలన విషయంలో గతంలో దసరాకు వెళ్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు డిసెంబర్ వరకు అంటున్నారని విమర్శించారు. విశాఖలోని రిషికొండను ధ్వంసం చేసి దాదాపు 500 కోట్లతో వివిధ రకాల భవనాల నిర్మాణం చేపడుతున్నారని ఎంపీ చెప్పారు. టూరిజం కోసం నిర్మాణాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోందని... టూరిజం కోసం అయితే అంత పెద్ద భవనాలు ఎందుకని ప్రశ్నించారు.
సీఎం జగన్ విశాఖకు మకాం మార్చినంత మాత్రాన సర్వీసు నిబంధనల ప్రకారం పాలన అధిపతిగా ఉన్న సిఎస్, ఇతర కార్యదర్శులు శాశ్వతంగా వెళ్లే అవకాశం ఉండదన్నారు. మరోవైపు ఏపీ అధికార పరిధిలో లేని అంశాలను తీసుకువచ్చి మార్గదర్శి విషయంలో ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తలా తోక లేకుండా ఏవేవో కేసులు తీసుకొచ్చి మోపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీనికి తోడు దున్నపోతు ఏందంటే దూడను కట్టేసాం సార్ అంటూ సీఎం జగన్ వద్దకు వచ్చి సెల్యూట్ చేసేలా కొందరు అధికారుల తీరు ఉందని రఘురామ ఆక్షేపించారు. సీఎం జగన్ తాడేపల్లి లో ఉన్న జనాలను కలవరు. అక్కడికి వెళ్లినా కలిసేది ఉండదు. అందువల్ల సీఎం ఎక్కడున్నా పెద్ద ఉపయోగం ఏమీ ఉండదని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంలో రిమాండ్ తీర్పు చూస్తే జాలేస్తుంది. న్యాయవ్యవస్థను మనం అనడం కూడా సరికాదు.గవర్నర్‌కి సమాచారం లేదు. గతంలో నన్ను పుట్టిన రోజు నాడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబును పెళ్లి రోజునే అరెస్ట్ చేశారు. 2లక్షల అరవై వేల మంది స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ట్రైనింగ్ అయ్యారు.ఇంత మందికి ట్రైనింగ్ ఇస్తే కనీసం 3 వేల కోట్లు అవుతుంది.కొందరు ఐఏఎస్‌లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
చంద్రనాయుడు మాజీ సీఎం ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారు. సీఎం హోదాలో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేయడం లేదా ?మా పార్టీకి ఎక్స్‌పైరి డేట్ అయిపోయింది. అవినీతి కేసులో ఏసీబీ అధికారులు ఉండాలి, సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది. రిషికొండపై సీఎం నివాసం కట్టుకున్నారు అని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఏదో ఒకరోజు అధికారులు ఆ బిల్డింగ్ చూసి సీఎం కార్యాలయానికి అయితే బాగుంటుందని అంటారని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖలో 9 స్థానాలు టీడీపీ, జనసేన మూకుమ్మడిగా సీట్లు కొట్టేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ మాట తప్పకుండా రుషికొండ వెళ్లాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నానని రఘురామ అన్నారు.