Minister Seediri Appalraju: అమరావతిలో మాయా ప్రపంచం, అందుకే చంద్రబాబుకు ఐటీ నోటీసులు: మంత్రి సీదిరి
Minister Seediri Appalraju: చంద్రబాబు ఐటీ విచారణకు అర్హుడు అని.. ఈ కేసు నుంచి అతడు అస్సలే తప్పించుకోలేడని మంత్రి సీదిరి అప్పల్రాజు అన్నారు.
Minister Seediri Appalraju: అమరావతిలో జరిగిన నిర్మాణాలకు సంబంధించి ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి ఐటీ సెంట్రల్ శాఖ ఆగస్ట్ 4వ తేదీన నోటీసులు ఇచ్చిందని మంత్రి సీదిరి అప్పల్రాజు తెలిపారు. అప్పటి నుంచి ఈరోజు వరకు చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేయగలగే బాబు, అమరావతిలో మాయా ప్రపంచాన్ని సృష్టించాడని ఆరోపించారు. అది ఒక పెద్ద స్కాం అని విమర్శించారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టి డోపింగ్ లో దొరికిపోయినట్లయింది చంద్రబాబు పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. తాత్కాలిక సెక్రటేరియట్ కే వెయ్యి కోట్లు పెట్టారంటే ఎవరూ నమ్మలేరని చెప్పుకొచ్చారు. రెండు బోగస్ కంపెనీలను పెట్టి వాసుదేవ, పార్థ సారథి నుంచి వినయ్, విక్కి అనే ఇద్దరు వ్యక్తులను పెట్టీ నిధులు మళ్లించాడని అన్నారు. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్టు ఏటీఎం అని సాక్షాత్తు ప్రధాని నరేంద్ మోదీనే చెప్పారని మంత్రి సీదిరి అప్పల్రాజు విమర్శించారు.
చంద్రబాబు ఇపుడు దొరికి పోయిన దొంగ అని... అందుకే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని చెప్పారు. ఐటీ సెంట్రల్ శాఖ నోటీసులు ఇస్తే... ఇక్కడ పరిధిలో ఉన్నవారితో నోటీసులు ఇప్పించాలని అంటున్నారని వివరించారు. ఇప్పటికీ సంస్థలను మేనేజ్ చేస్తున్నాడే తప్ప సమాధానం చెప్పటం లేదని ఫైర్ అయ్యారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని అడిగారు. పవన్ కల్యాణ్ సపోర్ట్ చేసిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఇదని చెప్పుకొచ్చారు. వాళ్లంతా తోడి దొంగలని, నిజంగానే జనసేనాని ప్యాకేజీ తీసుకోకపోతే చంద్రబాబును ప్రశ్నించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం, ఎన్టీఆర్ పేరిట చెల్లని నాణేలు రిలీజ్ చేయడం ఒక స్పాన్సర్ ప్రోగ్రాం అని అర్థం అవుతోందని తెలిపారు. బీజేపీ వాళ్ల శరణు కోరటానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడంటూ మంత్రి అప్పల్రాజు ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎంత నీచానికైన చంద్రబాబు దిగజారిపోతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఐటీ విచారణకు అర్హుడు అని, 14 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో ఉంటాయని తెలిపారు. వాటిపై విచారణ చేపట్టి చంద్రబాబును జైల్లో పెట్టాలని సూచించారు. చంద్రబాబు ఈ కేసును నుంచి అస్సలే తప్పించుకోలేడని, ఇది ఆరంభం మాత్రమే అంటూ కామెంట్లు చేశారు.