Hindupuram minister Peddireddy : హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి 6రోజుల ఆపరేషన్ - అంతా సెట్ చేశారా ?
Minister Peddireddy : హిందూపురంలో ఆరు రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డి పర్యటించారు. పార్టీలో విబేధాల్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
Hindupuram Politics : హిందూపురంలో వైసీపీని బలపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరు రోజులు పర్యటించారు. హిందూపూర్ రూరల్ మండలం తో పాటు, లేపాక్షి, చిలమత్తూరూ మండలాల్లో పర్యటించారు. హిందూపూర్ లో పార్టీ బలోపేతం పై పూర్తి ఫోకస్ చేశారు. వర్గ విబేధాలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని నాయకులకు సూచించారు.
జగన్, చంద్రబాబు పాలన మధ్య తేడా గమనించాలన్న పెద్దిరెడ్డి
సిఎం జగన్, చంద్రబాబు పాలన మధ్య ప్రజలు తేడా గమనించాలని పర్యటన ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు 2014 లో 600 హామీలు, 100 పేజీల మానిఫెస్టో ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఆ మానిఫెస్టో కనపడకుండా చేశారని ఆరోపించారు. రైతు, మహిళా రుణాలు మాఫీ పేరుతో దగా చేశారన్నారు బాబు వస్తె జాబు వస్తుంది అని చెప్పి అధికారం లోకి రాగానే 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేశారని విమర్శించారు. మహిళా సంఘాల రుణాలు రాదు చేయాలని అసరా పేరుతో వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని..
ఈ నెల అందించే 4 వ విడత తో కలిపి మొత్తం 27 వేల కోట్లు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నామన్నారు.
కిలో బియ్యం ఐదు రూపాయలు చేసిన చంద్రబాబు
చంద్రబాబు అధికారంలోకి రాగానే రెండు రూపాయల కిలో బియ్యం 5 రూపాయిలు చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ ఎక్కువ అప్పులు చేయలేదని చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు సిఎం జగన్ తీరుస్తున్నారని తెలిపారు. సిఎం జగన్ అధికారం లోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు... ఈ స్థాయి లో దేశం లో ఎవరూ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలు అన్ని మానిఫెస్టో లో పొందుపరిచారు.. అధికారం లోకి రాగానే అవి అమలు చేయడం పై దృష్టి సారించారన్నారు. దేశం లో 99.5 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.
అందరికీ పథకాలు
కులం, మతం, పార్టీ చూడకుండా పేదలందరికీ సిఎం జగన్ అండగా నిలిచారని.. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పేరుతో వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందించారని ఆరోపించారు. గతంలో జన్మభూమి సమావేశాలు కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు వృద్దులు ఎదురు చూసే పరిస్థితి ఉండేదన్నారు నేడు ఉదయం 5 గంటలకే మనకు సిఎం జగన్ పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని.. అలాంటి మ్యానిపులేటర్లకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఈ రోజు హిందూపూర్ లో ఎంపి, ఎమ్మెల్యే స్థానాలకు మహిళలను నిలబెట్టామని.. ఆ దైర్యం చంద్రబాబు కు ఉందా అని ప్రశ్నించారు.
సిఎం జగన్ మరి సారి ముఖ్యమంత్రి అయితే మరింత సుపరిపాలన అందిస్తారని చెప్పుకొచ్చారు.