Kodali Nani: మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్, వంగవీటి రాధాకు కూడా.. ఆస్పత్రిలో చికిత్స
మంత్రి కొడాలి నాని ప్రభుత్వ పరమైన కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు.
ఏపీ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన కరోనా స్వల్ప లక్షణాలతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన అనుచరులు తెలిపారు. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మంత్రి కొడాలి నాని దాదాపు ప్రతి రోజు వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రభుత్వ పరమైన కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. దీంతో పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఆయన వ్యక్తిగత డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు. తనను ఇటీవల కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. దీంతో ఇటీవల కొడాలి నానిని కలిసిన వారిలో కూడా ఆందోళన మొదలైంది.
వంగవీటి రాధాకు కూడా పాజిటివ్
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయన కూడా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలోనే చేరారు. అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వంగవీటి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధాలు కలిసి గత నెలలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో ఇద్దరితో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధా లేవనెత్తిన అనుమానాలతో టీడీపీ నాయకులు ఆయనను పరామర్శించడానికి క్యూ కట్టారు. ఏకంగా చంద్రబాబు కూడా ఆయన్ను పరామర్శించిన సంగతి తెలిసిందే.
పెరుగుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 36,452 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 1831 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 242 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,974 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 7195 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన