Botsa About Chandrababu Security: చంద్రబాబుకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత - మంత్రి బొత్స ఆశ్చర్యకర వ్యాఖ్యలు
Minister Botsa Comments On CBN Security: టీడీపీ అధినేత నారా చంద్రబాబు భద్రత విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Minister Botsa Comments On CBN Security: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అక్టోబర్ నెలలో జరగనున్న విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, విజయనగరం ఉత్సవాల నిర్వహణపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. చంద్రబాబు భద్రత విషయంలో ఏ లోపం జరిగినా తాము బాధ్యత వహిస్తామన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన ప్రమేయం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలని మంత్రి సూచించారు.
పైడితల్లి సిరిమాను ఉత్సంపై మంత్రి సమీక్ష
పైడితల్లి సిరిమాను జాతరను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు సూచించారు. అధికారులు అందరూ సొంత పండుగగా భావించాలని అన్నారు. నిర్ధిష్ఠ సమయానికే సిరిమాను మొదలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. సిరిమాను జాతర ఆలస్యం కాకుండా ముందుగానే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పార్లమెంటులో కేంద్రం తెస్తున్న మహిళా బిల్లు విషయంపైనా మంత్రి బొత్స స్పందించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న మహిళా బిల్లుకు వైసీపీ అండగా నిలుస్తుందని బొత్స వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ మహిళలకు స్ధానిక సంస్ధల్లో 50 శాతం సీట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
జైలులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భద్రత విషయంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పాత్రికేయులు ప్రశ్నించడగా బొత్స సమాధానమిచ్చారు. చంద్రబాబు భద్రత బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అన్నారు. ఏదైనా లోపం జరిగిన పూర్తి బాధ్యత వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 2005లో జరిగిన వోక్స్ వ్యాగన్ కేసు విషయంలో వచ్చిన ఆరోపణలపై అప్పట్లో సీబీఐ విచారణ జరిపించామని చెప్తూ.. ఆ విచారణలో బాధ్యులపై చర్యలు తీసుకుని నిధులను సైతం రికవరీ చేశామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కూడా చంద్రబాబు తన తప్పు లేదని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
చంద్రబాబు భద్రతపై పలువురు మంత్రులు, డీఐజీ వివరణ
చంద్రబాబు భద్రత విషయంలో ఎదురవుతున్న విమర్శలపై వైసీపీ ప్రభుత్వం తరఫున ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు. అలాగే జైలు తాజా ఇన్ ఛార్జ్ గా నియమించిన డీఐజీ రవికిరణ్ సైతం వివరణ ఇచ్చారు. అయినా టీడీపీ నేతల విమర్శల దాడి ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ తాజా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నారా భువనేశ్వరి ఆందోళన
చంద్రబాబు భద్రతపై తనకు భయంగా ఉందని ఆయన సతీమణి భువనేశ్వరి గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జైలులో ద్రబాబును భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలిశారు అనంతరం జైలు వద్ద భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయన్ను తీసుకెళ్లి పెట్టారని, చంద్రబాబును వీడి బయటకు వస్తుంటే తన మనసు చలించిందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తోందని భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు.