విద్యుత్ కోతలపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలుంటాయి: మంత్రి బాలినేని
విద్యుత్ సంక్షోభంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలుంటాయని ఏపీ మంత్రి బాలినేని అన్నారు. కావాలనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు.
విద్యుత్ కోతలపై కావాలనే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. తక్కువ ధరకు సౌర విద్యుత్ సరఫరా చేసేందుకు ఉత్పత్తిదారులు ముందుకు వస్తే.. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేశాయని ఆరోపించారు.
విద్యుత్ కొరత గానీ విద్యుత్ కోతలు గానీ లేవని ఇటివలే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దసరా అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలంటూ జరుగుతున్న ప్రచారంపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిస్కమ్ సీఎండీలు ఇటివలే స్పందించారు. జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలిపారు.
విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వల్ల సరఫరాలో అంతరాయాలు, కోతలు లేవని స్పష్టం చేశాయి. కరెంట్ కోతలంటూ జరుగుతున్న ప్రచారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. బొగ్గు సంక్షోభం వల్ల తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. ఇది ఒక్క ఏపీకి సంబంధించిన సమస్య కాదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని విద్యుత్ శాఖ హామీ ఇచ్చింది. కోతలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యుత్ సరఫరాపై తప్పుడు వార్తలను నమ్మవద్దని వినియోగదారులకు ఇంధనశాఖ విజ్ఞప్తి చేసింది. వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వార్తల్ని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు విజ్ఞప్తి చేశాయి.
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు