YS Jagan: దాడులు ఇక్కడితో ఆపండి, లేకపోతే రేపు మీ వాళ్లకు ఇదే గతి!: చంద్రబాబుకు వైఎస్ జగన్ వార్నింగ్
Andhra Pradesh | టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన అజయ్ కుమార్ రెడ్డి అనే యువకుడ్ని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును హెచ్చరించారు.
YS Jagan Mohan Reddy warns AP CM Chandrababu over attack of YSRCP leaders | పులివెందుల: దాడుల సంప్రదాయాన్ని ఆపాలని, లేకపోతే రేపు మీకు ఇలాంటే గతి పడుతుందని వైఎస్సా్ర్ సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ శనివారం కడప జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో కడప రిమ్స్‌కు వెళ్లి వెంపల్లిలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు. బాధితుడికి తాము అండగా ఉంటామని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. బాధితుడి గాయాలు, మెడికల్ కండీషన్ పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ శ్రేణుల దారుణాలు..
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘25 ఏళ్ల యువకుడు అజయ్ కుమార్ రెడ్డిని టీడీపీ శ్రేణులు దారుణంగా కొట్టాయి. ఎందుకంటే తను వైఎస్సార్ సీపీ పార్టీకి ఓటు వేశాడని, అదే పనిగా కావాలని వాహనాల్లో వెంపల్లెకు వచ్చి అతడి బైక్ అడ్డుకుని దాడికి పాల్పడ్డారని వైఎస్ జగన్ ఆరోపించారు. పాతికేళ్ల యువకుడిపై ఎందుకంత కోపం, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కనిపిస్తే ఇలాగే దాడులు చేస్తారా అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇలా దాడులు చేసి అమాయకులపై నిర్ధాక్షిణ్యంగా దాడులు చేసి ఆసుపత్రి పాలు చేస్తే మీకు కలిగే ప్రయోజనం ఏముంది, ఏం సాధిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఎన్నో ఎన్నికలు జరిగాయి, కానీ పులివెందులలో తొలిసారి తమకు ఓటు వేయని వారిపై ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భయాందోళన కలిగించే చర్యలకు దిగుతున్నారు. ఇప్పుడు మీరు వేస్తున్న బీజం, చేసే పనులు రేపు పొద్దున టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది. ఇలా భయందోళన కల్పిస్తే తనకు ప్రయోజనం ఉందని భావిస్తున్నారు. కానీ చంద్రబాబు దయచేసి ఈ చెడు సంప్రదాయాన్ని తప్పకుండా ఆపేయండి. ఎప్పటికీ మీరే అధికారంలో ఉండరు. శిశుపాలుడి పాపాల్లా పెరిగిపోతున్నాయి. వీటిని గమనిస్తున్న ప్రజలు, ఇప్పుడు దెబ్బతిన్న వారు రేపు అటువైపు ఇలాంటి దాడులు చేయడానికి చంద్రబాబు బీజం వేస్తున్నారు. నాయకులుగా మేం ఇలాంటి చర్యలకు దిగకూడదు. దయచేసి వీటిని ఇక్కడితో ఆపేయాలి. లేకపోతే భవిష్యత్తులో టీడీపీ శ్రేణులపై దాడులకు ఇవి ప్రేరేపిస్తున్నాయని’ వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హామీలు అమలు చేయడం లేదని విమర్శలు
మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలు కావడం లేదని వైఎస్ జగన్ ఆరోపించారు. 90 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వారికి బ్యాగులు, కిట్లు సైతం సరిగ్గా పంపిణీ చేయడం లేదని విమర్శించారు. మాకు రావాల్సిన 10 శాతం ఓట్లు మీకు ఎందుకు పడ్డాయంటే, చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలే కారణం. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కానీ అమ్మ ఒడి డబ్బులు ఇంకా అకౌంట్లో వేయడం లేదన్నారు. ప్రతి ఇంటికి రూ.3 వేల నిరుద్యోగ భృతి కోసం జాబ్స్ లేని యువత ఆశగా ఎదురుచూస్తోంది. కావాలంటే ఇలాంటి హామీలు నెరవేర్చాలి కానీ తమకు ఓటు వేయలేదనన కక్షతో దాడులు చేయడం సరికాదని వైఎస్ జగన్ హితవు పలికారు.